HAMPI: చరిత్ర సృష్టించిన కోనేరు హంపీ
వరల్డ్ కప్‌లో దూసుకుపోతున్న కోనేరు హంపి.. సెమీస్ చేరిన తొలి భారత మహిళగా రికార్డు;
భారత చెస్ చరిత్రలో ఒక సరికొత్త అధ్యాయం లిఖితమైంది. తెలుగు తేజం, భారత గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి ఫిడే మహిళల ప్రపంచ కప్ సెమీఫైనల్‌కు చేరుకున్న తొలి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించారు. జార్జియాలో జరుగుతున్న ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్లో ఆమె తన అద్భుతమైన వ్యూహాలు, పట్టుదలతో దేశానికే గర్వకారణంగా నిలిచింది. క్వార్టర్ ఫైనల్లో కోనేరు హంపి చైనాకు చెందిన యుక్సిన్ సాంగ్ పై 1.5-0.5 తేడాతో విజయం సాధించింది. ఈ క్రమంలో ఆమెకు వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
మ్యాచ్ సాగిందిలా..?
తొలి గేమ్‌లో తెల్లపావులతో ఆడిన కోనేరు హంపి.. యుక్సిన్ సాంగ్‌పై 53 ఎత్తుల్లో విజయం సాధించింది. ఈ గెలుపు తెలుగమ్మాయికి స్పష్టమైన ఆధిక్యాన్ని ఇచ్చింది. ఈ మ్యాచ్ ఓపెనింగ్‌లో లభించిన అడ్వాంటేజ్‌ను వాడుకొని హంపి విజయం సాధించింది. రెండో గేమ్‌ను హంపి 53 ఎత్తుల్లో డ్రా చేసుకుంది. అప్పటికే ఒక పాయింట్‌తో ఆధిక్యంలో ఉండటంతో.. ఈ డ్రా ఆమెను సెమీఫైనల్‌కు చేర్చడానికి కలిసొచ్చింది. సమయ లోపం వల్ల కొన్ని తప్పులు చేసిన హంపి.. వ్యూహాత్మకమైన ఆటతో ముందంజ వేసింది. ఈ గెలుపుతో క్యాండిడేట్స్ టోర్నీ ఆడే అవకాశాలు కోనేరు హంపికి మెరుగుపడ్డాయి. ప్రపంచకప్‌లో టాప్-3లో నిలిచిన ఆటగాళ్లు.. ఈ ఏడాది చివర్లో జరిగే క్యాండిడేట్స్ టోర్నీకి అర్హత సాధిస్తారు. ఈ ప్రపంచకప్‌లో రౌండ్ 3లో పోలాండ్‌కు చెందిన క్లౌడియా కులోన్పై 0-5-1.5 తేడాతో విజయం సాధించిన కోనేరు హంపి..నాలుగో రౌండ్లో స్విట్జర్లాండ్ స్టార్ అలెగ్జాండ్రా కొస్టెనిక్‌ను 2.5-1.5 తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్ ఫలితాన్ని టై బ్రేక్ ద్వారా తేల్చాల్సి వచ్చింది. సెమీఫైనల్లో టాప్ సీడ్ లీ టింజీ(చైనా)తో హంపి అమీతుమీ తేల్చుకోనుంది. టింజీ క్వార్టర్స్‌లో 2-0తో జార్జియా ప్లేయర్ ననా జాగ్నిజెను ఓడించింది.