Virat Kohli: జీవితం ఊహించినట్లు ఉండదు.. : విరాట్ కోహ్లీ భావోద్వేగం

Virat Kohli: 52 సంవత్సరాల వయస్సులో తనువు చాలించడం అనేది ఊహించని పరిణామం.

Update: 2022-03-05 10:17 GMT

Virat Kohli: అప్పటి వరకు మన మధ్యలోనే ఉంటారు.. అంతలోనే లోకాన్ని విడిచి వెళ్లిపోతారు.. ఏ నిమిషానికి ఏమి జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. ఆస్ట్రేలియా క్రికెటర్ షేన్ వార్న్ హఠాన్మరణం యావత్ ప్రపంచ క్రికెట్ అభిమానుల్ని కలచివేసింది. 52 ఏళ్ల వయసులో ఆస్ట్రేలియా లెగ్ స్పిన్నర్ శుక్రవారం గుండెపోటుకు గురై మరణించడం పట్ల విరాట కోహ్లీ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు.

భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ శనివారం షేన్ వార్న్‌కు నివాళులర్పించాడు. దిగ్గజ స్పిన్నర్ గుండెపోటుతో థాయ్‌లాండ్‌లో మరణించాడు. లెజెండ్రీ లెగ్-స్పిన్నర్ షేన్ వార్న్ దురదృష్టకర మరణానికి కోహ్లి విచారం వ్యక్తం చేశాడు. అతడి మరణం అనూహ్యమైనదని పేర్కొన్నాడు. ఇప్పటికీ ఈ వార్త నన్ను షాక్‌కి గురిచేస్తోంది.. షేన్ లేడన్న వార్త నమ్మలేకపోతున్నాను అని అన్నాడు.

"షేన్ వార్న్ మరణం గురించి గత రాత్రి మాకు సమాచారం అందింది. నిజం చెప్పాలంటే, జీవితంలో మనం చేసే పనిని కొనసాగించాలనుకుంటాము. ప్రస్తుత క్షణంలో మనం ఏమి చేస్తున్నామో దానిపట్ల జాగురూకతతో ఉండాలి. జీవితం చాలా విచిత్రమైనది. ఎన్నెన్నో అనుకుంటాం.. అన్నీ జరగవు. అంతలోనే నిష్క్రమణ.. పూర్తి చేయానలనుకున్న ఎన్నో పనులను మధ్యలోనే వదిలేసి వెళ్లాల్సి వస్తుంది. అందుకే జీవించి ఉన్న అన్ని క్షణాలకు మనం కృతజ్ఞతతో ఉండాలి. 52 సంవత్సరాల వయస్సులో తనువు చాలించడం అనేది ఊహించని పరిణామం. నేను నమ్మలేక, షాక్‌తో ఇక్కడ నిలబడి ఉన్నాను" అని విరాట్ కోహ్లీ అన్నాడు.

మైదానం వెలుపల కూడా అతడు నాకు పరిచయం. అతడు ఉన్నతమైన వ్యక్తిత్వం కలవాడు. పనిపట్ల నిబద్ధతతో ఉంటాడు. ఏదైనా విషయం పట్ల చాలా స్పష్టత ఉంటుంది. అతను ఏమి చెబుతున్నాడో అతనికి తెలుసు. నేను చూసిన ఒక గొప్ప స్పిన్నర్ అతడు అని వార్న్‌ని తలుచుకున్నాడు.

"అతడిని నేను ఖచ్చితంగా మిస్ అవుతున్నానని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అతడి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. వారి కుటుంబానికి ఈ విషయాన్ని జీర్ణించుకోవడం ఎంత కష్టమైనదో నాకు తెలుసు. వారికి మా మద్దతు ఉంటుంది. అతడి ఆత్మకు శాంతి కలగాలని దేవుని ప్రార్థిస్తున్నాను అని కోహ్లీ తెలిపాడు. 

లెగ్ స్పిన్నర్ షేన్ వార్న్ తన క్రికెట్ కెరీర్‌లో మొత్తం 1001 వికెట్లు తీసుకున్నాడు. అంతర్జాతీయంగా 1,000 వికెట్ల శిఖరాన్ని అందుకున్న తొలి బౌలర్‌గా నిలిచాడు.

Tags:    

Similar News