క్రికెట్ ప్రపంచంలో లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్‌ను క్రికెట్ కా మక్కా అని పేరు. ఇప్పుడు క్రికెట్ అభిమానులకు లార్డ్స్ మైదానంలో ఒక భాగాన్ని తమ సొంతం చేసుకునే అవకాశం లభించింది. మెరిలెబోన్ క్రికెట్ క్లబ్ ఈ అరుదైన అవకాశాన్ని కల్పిస్తోంది. లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్, క్రికెట్ చరిత్రలో అత్యంత ప్రసిద్ధి చెందిన మైదానాలలో ఒకటి. ఈ మైదానాన్ని నిర్వహించే మెరిలెబోన్ క్రికెట్ క్లబ్, ఈ ఏడాది సెప్టెంబర్‌లో పిచ్‌ను పునర్నిర్మించాలని నిర్ణయించింది. దీని కోసం పాత గడ్డిని తొలగించి, కొత్త గడ్డిని వేయనున్నారు. ఈ సందర్భంగా మెరిలెబోన్ క్రికెట్ క్లబ్ ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకుంది. క్రికెట్ అభిమానులు పాత పిచ్‌లోని గడ్డి (టరఫ్) ముక్కను కొనుగోలు చేసే అవకాశాన్ని కల్పిస్తోంది. లార్డ్స్ క్రికెట్ మైదానంలోని గడ్డి ముక్కను కేవలం 50 పౌండ్ల (సుమారు రూ.5000)కు కొనుగోలు చేయవచ్చు. ఈ గడ్డి ముక్క 1.2 x 0.6 మీటర్ల సైజులో ఉంటుంది. ఈ ఆఫర్ క్లబ్ సభ్యులతో పాటు సాధారణ క్రికెట్ అభిమానులకు కూడా అందుబాటులో ఉంటుంది. అయితే, ఈ గడ్డి ముక్కలు పరిమిత సంఖ్యలో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. సెప్టెంబర్ 29 లేదా 30న స్వయంగా తీసుకోవాలి.