DHONI: ఇప్పటికిప్పుడు రిటైర్మెంట్ లేదు
తేల్చేసిన మహేంద్ర సింగ్ ధోనీ.. ఇంకా 10 నెలల సమయం ఉందని స్పష్టీకరణ;
తన రిటైర్మెంట్ వార్తలపై చెన్నై సూపర్‌కింగ్స్ స్టార్ ప్లేయర్ MS ధోనీ స్పందించాడు. ‘ఇప్పటికిప్పుడు IPLకు రిటైర్మెంట్ ప్రకటించను. ప్రస్తుతం నాకు 43 ఏళ్లు. జులైలో 44వ ఏటలోకి అడుగుపెడతా. ఇంకా ఆడాలా? వద్దా అని నిర్ణయించుకోవడానికి 10 నెలల టైమ్ ఉంది. నా రిటైర్మెంట్ నిర్ణయించేది నేను కాదు నా శరీరం. సీజన్ ప్రారంభానికి ముందు శరీరం సహకరిస్తోందనిపిస్తే ఆడతా. ఇక చాలు అని అనిపించేంతవరకు ఇదే విధానం కొనసాగిస్తా’ అని చెప్పారు. ధోనీ ఈ ఐపీఎల్ సీజన్ లో ఎప్పటిలాగే చివర్లో కాస్త అటు ఇటుగా బ్యాటింగ్ కు వచ్చి బానే మెరుపులు మెరిపిస్తున్నాడు. ఈ సీజన్ లో ఇప్పటి వరకు ఆడిన నాలుగు మ్యాచుల్లో 0, 30 నాటౌట్, 16, 30 స్కోర్లు చేశాడు. అలానే రెప్పపాటు వేగంతో కళ్లు చెదిరేలా రెండు స్టంప్ ఔట్లు కూడా చేశాడు. దీంతో మహీ వికెట్ కీపింగ్ నైపుణ్యానికి క్రికెట్ ప్రపంచమంతా ఆశ్యర్యపడింది. బ్యాటింగ్‌లోనూ ధోనీ ఇంకాస్త దూకుడు చూపిస్తే మరికొన్నేళ్లు అతడికి లీగ్‌లో ఎదురులేనట్లే అని పలువురు క్రికెట్ అభిమానులు అంటున్నారు. మరోవైపు ఇదే సమయంలో అతడి బ్యాటింగ్ ఆర్డర్ పై విమర్శలు కూడా వస్తున్నాయి. పలువురు హేటర్స్, మాజీలు.. మహీ ఐపీఎల్ కు వీడ్కోలు పలకాలని సూచిస్తున్నారు.
అందరూ అదే చర్చ..
అయితే ఇదే సమయంలో తాజాగా దిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచుకు ధోనీ తల్లిదండ్రులు రావడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. కొంపతీసి మహీ నిజంగానే ఐపీఎల్ కు రిటైర్మెంట్ ఇచ్చేస్తున్నాడా ఏంటి అని అందరూ చర్చించుకోవడం ప్రారంభించారు. ధోనీ రిటైర్మెంట్ హ్యాష్ ట్యాగ్ కూడా బాగా ట్రెండ్ అయింది. ఈ నేపథ్యంలో తన ఐపీఎల్ రిటైర్మెంట్ ప్రచారంపై మహీ స్పష్టత ఇచ్చాడు.
ధోనీ సత్తా అయిపోయింది దిగ్గజ క్రికెటర్ కామెంట్స్
ఆదాన్ న్యూస్: ఎంఎస్ ధోని రిటైర్డ్ అవ్వాల్సిన సమయం వచ్చిందంటూ సీఎస్కే మాజీ ఓపెనర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్ 2025లో సీఎస్కే, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరిగినప్పుడు కామెంటరీ బాక్స్ లో ఉన్న మాథ్యూ హేడెన్ ఈ మేరకు వ్యాఖ్యానించాడు. ధోని ఇప్పటికైనా ఈ విషయాన్ని గ్రహించాలని లేకుంటే సీఎస్కేకు ప్రమాదం అంటూ సూచనలు చేశాడు. ఎంఎస్ ధోని పేలవమైన ఫామ్ గురించి హేడెన్ మాట్లాడుతూ.. ఈ సీజన్ లో ధోని తన జట్టుకు మ్యాచ్ లను పూర్తి చేయడంలో విఫలమయ్యాడని అన్నాడు.