PAKISTHA: పాక్‌ జట్టుపై ఆగని విమర్శల హోరు

మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ ఆగ్రహం... మండిపడ్డ యూవీ తండ్రి;

Update: 2025-02-27 03:30 GMT

పాకిస్థాన్ క్రికెట్ టీమ్‌ను విమర్శిస్తున్న ఆ దేశ మాజీ క్రికెటర్లపై యువరాజ్ సింగ్ తండ్రి యోగ్ రాజ్ తీవ్రంగా మండిపడ్డాడు. పాక్ టీమ్‌ను చెడగొట్టింది.. ఆ దేశ మాజీ క్రికెటర్లే అని అన్నాడు. ఏడాదిలో ఓ విన్నింగ్ టీమ్ ను ఎలా తయారు చేయాలో తాను చేసి చూపిస్తానని యోగ్ రాజ్ ఛాలెంజ్ చేశారు. ‘మీ టీమ్‌ను మీరు మార్చడానికి మీ చెమట, రక్తం ధారపోయాలి’ అంటూ వారికి యోగ్ రాజ్ సలహా ఇచ్చారు.

పాక్ జట్టుపై మాజీ ప్రధాని ఇమ్రాన్ ఫైర్

ఛాంపియన్స్‌ ట్రోఫీలో పాకిస్థాన్ పేలవ ప్రదర్శనపై ఆ దేశ మాజీ ప్రధాని, జట్టు మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ కీలక ప్రకటన చేశారు. ప్రస్తుత CTలో పాక్ జట్టు ప్రదర్శన పట్ల తాను అసంతృప్తిగా ఉన్నానన్నాడు. భారత్ తో జరిగిన మ్యాచ్ లో పాక్ ఓటమిపై విచారం వ్యక్తం చేశారు. నిర్ణయాలు తీసుకునే హక్కును తనకు ఇష్టమైన వ్యక్తులకు పీసీబీ ఇస్తే.. పాకిస్థాన్ క్రికెట్ చివరికి నాశనం అవుతుందని ఇమ్రాన్ ఖాన్ తెలిపారు.

భారత్‌తో ఓటమికి కారణం అదే: పాక్ కోచ్

భారత్‌తో ఓటమిపై పాకిస్థాన్ కోచ్ అకీబ్ జావేద్ స్పందించాడు. ‘టీమిండియా-పాకిస్థాన్ మ్యాచ్‌తో చాలా భావోద్వేగాలు ముడిపడి ఉంటాయి. మానసికంగా ఇబ్బందికి గురవుతారు. అభిమానులు, జర్నలిస్టుల కంటే ఆటగాళ్లు చాలా ఎక్కువ బాధపడ్డారు. భారత్‌లాంటి జట్టుతో ఆడాలంటే చాలా అనుభవం అవసరం. ప్రస్తుతం మా జట్టులో అనుభవజ్ఞులైన ఆటగాళ్లు ఎక్కువగా లేరు. ఒకే గ్రౌండ్‌లో ఆడటం వల్ల భారత్‌కు కచ్చితంగా ప్రయోజనం ఉంటుంది’ అని చెప్పాడు.

పాక్ జట్టు నుంచి ఐదుగురు ఆటగాళ్లు ఔట్!

ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసిన తర్వాత పాకిస్థాన్ జట్టులో కీలక మార్పులు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఆ జట్టు నుంచి కనీసం ఐదుగురు స్టార్ ఆటగాళ్లను PCB తొలగించే అవకాశం ఉందని సమాచారం. ఇందులో బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్, నసీమ్ షా, తయ్యబ్ తాహిర్ వంటి స్టార్ ఆటగాళ్ల పేర్లు కూడా ఉన్నాయని తెలుస్తోంది. ఛాంపియన్స్ ట్రోఫీలో ఆతిథ్య పాకిస్థాన్ జట్టే మొదటగా నిష్క్రమించిన సంగతి తెలిసిందే.

Tags:    

Similar News