PIYUSH CHAWLA: క్రికెట్‌కు ఐపీఎల్‌ లెజెండ్‌ వీడ్కోలు

టీమిండియా వెటరన్ స్పిన్నర్ పీయుష్ చావ్లా సంచలన నిర్ణయం;

Update: 2025-06-07 02:30 GMT

టీమిండియా వెటరన్ స్పిన్నర్ పీయుష్ చావ్లా సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు 36 ఏళ్ల ఈ లెగ్ స్పిన్నర్ ప్రకటించాడు. టీ20 ప్రపంచ కప్-2007, వన్డే వరల్డ్ కప్-2011ను గెలుచుకున్న భారత జట్టులో సభ్యుడిగా ఉన్న పీయుష్.. క్రికెట్ నుంచి వైదొలుగుతున్నట్లు వెల్లడించాడు. సుదీర్ఘ కెరీర్‌లో తన సక్సెస్‌కు సహకరించిన వారందరికీ అతడు ధన్యవాదాలు తెలిపాడు. అందమైన ఆటకు వీడ్కోలు పలికేందుకు ఇదే సరైన సమయమని భావిస్తున్నట్లు చెప్పాడు పీయుష్. రిటైర్‌మెంట్ ఇచ్చినా తన నుంచి క్రికెట్‌ను వేరు చేయలేరని అన్నాడు. టీమిండియాకు ఆడిన ప్రతి క్షణాన్ని ఆస్వాదించానని.. వరల్డ్ కప్ జ్ఞాపకాలు ఎప్పటికీ మర్చిపోనని పేర్కొన్నాడు. తనపై నమ్మకం ఉంచి ప్రోత్సహించిన ఐపీఎల్ ఫ్రాంచైజీలు పంజాబ్ కింగ్స్, చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్‌కు అతడు థ్యాంక్స్ చెప్పాడు.

ఐపీఎల్‌లో ఎన్నో రికార్డులు

36 ఏళ్ల పియూశ్‌ చావ్లాకు ఐపీఎల్‌లో ఘనమైన ట్రాక్‌ రికార్డు ఉంది. ఆరంభ సీజన్‌ నుంచి (2008) క్యాష్‌ రిచ్‌ లీగ్‌ ఆడుతున్న అతను 192 మ్యాచ్‌ల్లో 192 వికెట్లు తీసి లీడింగ్‌ వికెట్‌ టేకర్ల జాబితాలో సంయుక్తంగా మూడో స్థానంలో ఉన్నాడు. ఐపీఎల్‌లో చహల్‌ (221), భువనేశ్వర్‌ కుమార్‌ (198) మాత్రమే చావ్లా కంటే ఎక్కువ వికెట్లు తీశారు. సునీల్‌ నరైన్‌ చావ్లాతో సమానంగా 192 వికెట్లు తీశాడు. 2008లో కింగ్స్‌ ఎలెవెన్‌ పంజాబ్‌తో కెరీర్‌ ప్రారంభించిన చావ్లా.. ఆతర్వాత కేకేఆర్‌, సీఎస్‌కే, ముంబై ఇండియన్స్‌ ఫ్రాంచైజీలకు ప్రాతినిథ్యం వహించాడు. చివరిగా 2024 సీజన్‌లో ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహించిన చావ్లాను ఈ సీజన్‌ మెగా వేలంలో ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు.రైట్‌ ఆర్మ్‌ లెగ్‌ స్పిన్‌ బౌలర్‌ అయిన చావ్లా 2006లో టీమిండియా తరఫున టెస్ట్‌ అరంగేట్రం చేసి, ఆ ఫార్మాట్‌లో 3 మ్యాచ్‌లు ఆడి 7 వికెట్లు తీశాడు. ఆ తర్వాత 2007లో వన్డే, 2010లో టీ20 అరంగేట్రం చేసిన చావ్లా 25 వన్డేల్లో 32 వికెట్లు, 7 టీ20ల్లో 4 వికెట్లు తీశాడు. 

Tags:    

Similar News