సుదీర్ఘమైన దేశవాళీ క్రికెట్ సీజన్ ప్రారంభానికి ముందు ముంబై క్రికెట్ జట్టుతో పాటు అభిమానులకు షాక్ తగిలింది. సీనియర్ బ్యాట్స్‌మెన్ అజింక్య రహానే కెప్టెన్సీకి రాజీనామా చేశాడు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. జట్టు కొత్త నాయకత్వాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఇదే సమయం మంచి సమయమని పేర్కొన్నాడు. జట్టుకు నాయకత్వం వహించడం, టోర్నమెంట్ గెలువడం తనకు చాలా గౌరవమని పేర్కొన్నాడు. "ముంబై జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించడం, ఛాంపియన్‌షిప్‌లు గెలవడం నాకు దక్కిన గొప్ప గౌరవం. రాబోయే దేశవాళీ సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని, ఒక కొత్త నాయకుడిని సిద్ధం చేయడానికి ఇదే సరైన సమయమని నేను నమ్ముతున్నాను. అందుకే కెప్టెన్సీ బాధ్యతల నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నాను" అని రహానే 'ఎక్స్' ఖాతాలో పేర్కొన్నారు. ఒక ఆటగాడిగా జట్టుకు తన సేవలు అందిస్తూనే ఉంటానని, ముంబైకి మరిన్ని ట్రోఫీలు అందించేందుకు కృషి చేస్తానని ఆయన పేర్కొన్నాడు.
యశస్వికా? శ్రేయస్‌కా?
ముంబై జట్టులో నాణ్యమైన ఆటగాళ్లకు కొదవేం లేదు. అయ్యర్, సూర్యకుమార్, యశస్వి జైస్వాల్, సర్ఫరాజ్ ఖాన్ వంటి అంతర్జాతీయ క్రికెటర్లు ఉన్నారు. శ్రేయస్, సూర్య ఐపీఎల్‌లో సారథ్యం చేపట్టిన అనుభవం ఉంది. టెస్టుల్లో యశస్వి జైస్వాల్ దూకుడు చూస్తూనే ఉన్నాం. వారిద్దరితో పోలిస్తే యశస్వి సుదీర్ఘ ఫార్మాట్‌లో మంచి ఇన్నింగ్స్‌లు నిర్మించగల సమర్థుడు. ఇటీవలే అతడు గోవా జట్టుకు ఆడదామనే ఆలోచనను కూడా విరమించుకున్నాడు. యశస్వికే జట్టు పగ్గాలు అప్పగించే అవకాశం ఉంది.