RCB: చిన్నస్వామికి మళ్లీ పెద్ద సంబరం
చిన్నస్వామిలో మళ్లీ క్రికెట్ సందడి... నెలల తరబడి నెలకొన్న అనిశ్చితికి తెర... కీలక ప్రకటన చేసిన కర్ణాటక క్రికెట్ బోర్డు
నెలల తరబడి కొనసాగిన అనిశ్చితికి ఎట్టకేలకు తెరపడింది. క్రికెట్ అభిమానులు, ముఖ్యంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అభిమానులు ఊపిరి పీల్చుకునే శుభవార్త ఇది. బెంగళూరులోని ప్రతిష్ఠాత్మక ఎం. చిన్నస్వామి స్టేడియంలో మళ్లీ క్రికెట్ సందడి మొదలుకానుంది. అంతర్జాతీయ మ్యాచ్‌లు, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పోటీల నిర్వహణకు కర్ణాటక ప్రభుత్వం అనుమతి మంజూరు చేసినట్లు కర్ణాటక రాష్ట్ర క్రికెట్ సంఘం (కేఎస్‌సీఏ) అధికారికంగా ప్రకటించింది. దీంతో ఆర్సీబీ హోంగ్రౌండ్‌గా పేరుగాంచిన చిన్నస్వామి స్టేడియం మళ్లీ క్రికెట్ ఉత్సవాలకు వేదిక కానుంది. ఈ విషయమై కేఎస్‌సీఏ విడుదల చేసిన ప్రకటనలో కీలక వివరాలు వెల్లడించింది. “బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో అంతర్జాతీయ, ఐపీఎల్ మ్యాచ్‌ల నిర్వహణకు కర్ణాటక ప్రభుత్వం, హోం శాఖ అనుమతి మంజూరు చేసిందని తెలియజేయడానికి మేం సంతోషిస్తున్నాం. ప్రభుత్వం నియమించిన టాస్క్‌ఫోర్స్ నివేదికను సమగ్రంగా పరిశీలించిన అనంతరం భద్రతా ఏర్పాట్లు సంతృప్తికరంగా ఉన్నాయని నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు” అని స్పష్టం చేసింది. ఈ ప్రకటనతో స్టేడియం భవిష్యత్తుపై నెలకొన్న సందేహాలకు తెరపడినట్లైంది.
గతంలో చోటుచేసుకున్న విషాద ఘటన కారణంగా చిన్నస్వామి స్టేడియంలో అన్ని క్రికెట్ కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఐపీఎల్ 2025 సీజన్లో 18 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఛాంపియన్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఆ చారిత్రక విజయాన్ని పురస్కరించుకుని గతేడాది జూన్ 4న చిన్నస్వామి స్టేడియంలో భారీగా సంబరాలు నిర్వహించారు. అయితే ఆ ఆనందోత్సాహం క్షణాల్లోనే విషాదంగా మారింది. స్టేడియం పరిసరాల్లో జరిగిన తొక్కిసలాటలో 11 మంది అభిమానులు ప్రాణాలు కోల్పోయారు. మరో 50 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. లక్షలాది మంది అభిమానులు ఒక్కసారిగా స్టేడియం వైపు తరలిరావడం, సరైన ట్రాఫిక్ నియంత్రణ, జనసంచార నియంత్రణ చర్యలు లేకపోవడమే ఈ దుర్ఘటనకు ప్రధాన కారణమని దర్యాప్తు నివేదిక తేల్చింది. ఈ ఘటన అనంతరం చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్‌ల నిర్వహణపై తీవ్ర ప్రశ్నలు తలెత్తాయి.
అసలేం జరిగిదంటే...?
ఈ విషాద ఘటనపై కర్ణాటక ప్రభుత్వం వెంటనే స్పందించింది. విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ జాన్ మైకెల్ డి. కున్హా నేతృత్వంలో ఒక న్యాయ విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఈ జ్యుడిషియల్ కమిషన్ స్టేడియంలో జరిగిన ఘటనకు గల కారణాలను లోతుగా పరిశీలించింది. భద్రతా లోపాలు, జన నియంత్రణలో వైఫల్యం, ముందస్తు ప్రణాళికల కొరత వంటి అంశాలను కమిషన్ తన నివేదికలో ప్రస్తావించింది. అంతేకాదు, అప్పటి పరిస్థితుల్లో చిన్నస్వామి స్టేడియం పెద్ద మ్యాచ్‌ల నిర్వహణకు పూర్తిగా సురక్షితం కాదని కమిషన్ తేల్చింది. ఈ నివేదిక నేపథ్యంలో చిన్నస్వామి స్టేడియంలో అన్ని క్రికెట్ కార్యకలాపాలను నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో అంతర్జాతీయ మ్యాచ్‌లు, ఐపీఎల్ పోటీలు ఇతర వేదికలకు తరలించాల్సి వచ్చింది. ఈ నిర్ణయం కేఎస్‌సీఏతో పాటు క్రికెట్ అభిమానులకు కూడా నిరాశ కలిగించింది. అయితే భద్రతే ప్రధానమన్న ఉద్దేశంతో ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది. విషాద జ్ఞాపకాలను దాటుకుని చిన్నస్వామి స్టేడియం మళ్లీ క్రికెట్ పండుగలకు సిద్ధమవుతోంది. గతంలో జరిగిన తప్పిదాల నుంచి పాఠాలు నేర్చుకుని, భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ మ్యాచ్‌లను నిర్వహిస్తామని హామీ ఇస్తున్నారు.