RINKU SINGH: రింకూ సింగ్ సెలెక్షన్ వెనుక రాజకీయ ఒత్తిడి.!
రింకూ సింగ్ ఎెంపికపై విమర్శలు... రింకూ కోసం బలైన శుభమన్ గిల్... రింకూ ఎంపికలో రాజకీయ ఒత్తిడి!
2026లో ఇండియా, శ్రీలంక సంయుక్తంగా అతిథ్యమివ్వనున్న టీ20 వరల్డ్ కప్ కోసం భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. 15 మంది సభ్యులతో కూడిన స్వ్కాడ్‌ను శనివారం (డిసెంబర్ 20) అనౌన్స్ చేసింది. ఫామ్‌లో లేనప్పటికీ సూర్య కుమార్ యాదవ్‌పై నమ్మకం ఉంచిన బీసీసీఐ కెప్టెన్సీ పగ్గాలను అతడికే అప్పగించింది. ఆల్ రౌండర్ అక్షర్ పటేల్‌ను వైస్ కెప్టెన్‌గా నియమించింది. ఫామ్‌లేమితో సతమతమవుతోన్న టీమిండియా వన్డే, టెస్ట్ కెప్టెన్ గిల్‌పై వేటు వేసింది.
ఇక్కడ వరకు బాగానే ఉన్నా.. టీ20 వరల్డ్ కప్ కోసం యంగ్ బ్యాటర్ రింకూ సింగ్‌ను ఎంపిక చేయడం చర్చనీయాంశంగా మారింది. రింకూ సింగ్‌ను టీ20 వరల్డ్ కప్‌కు ఎంపిక చేయడంపై ఎవరూ అభ్యంతరం చెప్పడం లేదు. కానీ అతడు టీ20 వరల్డ్ కప్ జట్టు ప్రణాళికలో ఉంటే స్వదేశంలో సౌతాఫ్రికాతో జరిగిన 5 మ్యాచుల టీ20 సిరీస్‌కు ఎందుకు పక్కనా బెట్టారనేదే ప్రశ్న. టీ20 వరల్డ్ కప్‌కు రింకూను పరిగణలోకి తీసుకోవాలనుకున్నప్పుడు అతడిని సౌతాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్ ఆడించాల్సిందని క్రీడా విశ్లేషకులు, సగటు క్రికెట్ అభిమాని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ ఆడిస్తే వరల్డ్ కప్‌కు ముందు అతడికి తగినంత ప్రాక్టీస్ లభించేదంటున్నారు. ఈ క్రమంలోనే కొందరు నెటిజన్లు బీసీసీఐ తీరుపై సెటైర్లు వేయడంతో పాటు విమర్శలు చేస్తున్నారు. అసలు మీరు ఏంటో.. మీ విధానాలేంటో అంటూ బీసీసీఐ, సెలక్షన్ కమిటీపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. గౌతమ్ గంభీర్ టీమిండియా హెడ్ కోచ్‌గా వచ్చిన్నప్పటీ నుంచి జట్టులో అసలేం జరుగుతోందో అర్ధం కావడం లేదని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.
చక్రం తిప్పిన కాబోయే భార్య
రింకూ సింగ్ కాబోయే సతీమణి, సమాజ్‌వాద్ పార్టీ ఎంపీ ప్రియా సరోజ్ చక్రం తిప్పిందని, బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా ద్వారా సెలెక్టర్లపై ఒత్తిడి తెచ్చిందనే ప్రచారం జోరుగా సాగుతోంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజీవ్ శుక్లాతో సమాజ్‌వాదీ పార్టీకి మంచి సత్సంబంధాలు ఉన్నాయని కామెంట్ చేస్తున్నారు. రింకూ సింగ్‌ను ఫినిషర్‌గా ఎంపిక చేయడంతో వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ అయిన జితీష్ శర్మను పక్కనపెట్టారు. బ్యాకప్ వికెట్ కీపర్ కమ్ ఓపెనర్ కోసం ఇషాన్ కిషన్‌ను తీసుకొచ్చారు. దాంతో ఓపెనర్ అయిన శుభ్‌మన్ గిల్‌ను తప్పించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
రాజకీయ కారణాలను పక్కనపెడితే.. గణంకాలు మాత్రం రింకూ సింగ్ ఎంపిక సరైనదేననే అభిప్రాయాన్ని కలిగిస్తోంది. రింకూ సింగ్ 35 టీ20ల్లో 42.30 సగటు, 161.76 స్ట్రైక్‌రేట్‌తో పరుగులు చేశాడు. మరోవైపు శుభ్‌మన్ గిల్ 36 మ్యాచ్‌ల్లో 28.03 సగటు, 138.59 స్ట్రైక్‌రేట్‌తో రాణించాడు. ఈ గణంకాలే శుభ్‌మన్ గిల్‌పై వేటు పడేలా చేశాయని అభిప్రాయం కలుగుతోంది. కానీ రాజకీయ జోక్యంతోనే శుభ్‌మన్ గిల్‌పై వేటు పడిందనే వాదన తీవ్ర చర్చనీయంశమైంది. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 జట్టులో రింకూ సింగ్‌ను ఫినిషర్‌గా ఎంపిక చేశారు. అయితే జట్టు ఎంపికలో రింకూ సింగ్ పేరును పరిగణలోకి తీసుకోలేదని, రాజకీయ ఒత్తిడితోనే చివరి నిమిషంలో ఎంపిక చేశారని సోషల్ మీడియా వేదికగా ప్రచారం జరుగుతోంది. రింకూ సింగ్ కోసం శుభ్‌మన్ గిల్‌తో పాటు యశస్వి జైస్వాల్, జితేష్ శర్మ వంటి ఆటగాళ్లను పక్కనపెట్టారని ఆరోపిస్తున్నారు. దీనిపై ఇప్పటి వరకూ అటు రింకూ సింగ్ కానీ ఇటు బీసీసీఐ కానీ ఎలాంటి ప్రకటన చేయలేదు.