IPL: రో"హిట్"’.. ముంబై సూపర్ విక్టరీ
చాలా కాలం తర్వాత ఫామ్‌లోకి రోహిత్ శర్మ.. 32 బంతుల్లోనే అర్ధ శతకం బాదిన హిట్ మ్యాన్;
ఐపీఎల్ 18వ సీజన్ ముంబయి ఇండియన్స్ కు హ్యాట్రిక్ విజయం దక్కింది. చెన్నై సూపర్ కింగ్స్ తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ముంబై 15.4 ఓవర్లలో కేవలం ఒక వికెట్ మాత్రమే కోల్పోయి ఛేదించింది. రోహిత్ శర్మ (76*), సూర్యకుమార్ యాదవ్ (68*) హాఫ్ సెంచరీలతో విరుచుకుపడ్డారు. వీరి ధాటికి 177 పరుగుల లక్ష్యం చిన్నబోయింది.
చెన్నైకి ఆరో ఓటమి
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై.. రవీంద్ర జడేజా (53*), శివమ్ దూబే (50) హాఫ్ సెంచరీలతో చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. నాలుగో ఓవర్ తొలి బంతికే రచిన్ రవీంద్ర (5) పెవిలియన్ చేరాడు. అశ్వనీ కుమార్ బౌలింగ్‌లో కీపర్ రికెల్‌టన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. గాయం కారణంగా రుతురాజ్ గైక్వాడ్ మ్యాచ్‌కు దూరం కావడంతో అతడి స్థానంలో బరిలోకి దిగిన 17 ఏళ్ల ఆయూష్ మాత్రే (32: 15 బంతుల్లో 4 ఫోర్లు 2 సిక్స్‌లు) భారీ షాట్లతో అలరించాడు. అయితే ఏడో ఓవర్ చివరి బంతికి చాహర్ బౌలింగ్‌లో శాంట్నర్‌కు చిక్కాడు. ఆ తర్వాత శాంట్నర్ బౌలింగ్‌లో షేక్ రషీద్ (19) స్టంపౌట్ అయ్యాడు. అనంతరం జడేజా, శివమ్ దూబే కలిసి ఇన్నింగ్స్‌ను నిర్మించారు. దూకుడుగా ఆడిన దూబే 30 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అశ్వినీ కుమార్ వేసిన 16 ఓవర్లో 24 పరుగులు వచ్చాయి. ఆ ఓవర్‌లో దూబే రెండు సిక్స్‌లు, జడేజా ఓ ఫోర్, సిక్స్ బాదారు. అనంతరం బుమ్రా వేసిన 16.2 ఓవర్‌కు భారీ షాట్ ఆడిన దూబే విల్ జాక్స్‌కు క్యాచ్ ఇచ్చాడు. కెప్టెన్ ధోనీని కూడా బుమ్రానే ఔట్ చేశాడు. చివరి ఓవర్‌లో జడేజా అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ముంబై బౌలర్లలో బుమ్రా రెండు, దీపక్ చాహర్, అశ్వనీ కుమార్, శాంట్నర్ తలో వికెట్ తీశారు.
చెలరేగిన హిట్ మ్యాన్
ఈ సీజన్లో ఒక్కసారి మాత్రమే 20పైన స్కోరు చేసిన రోహిత్ చెన్నైపై చెలరేగిపోయాడు. తనదైన శైలిలో షాట్లు ఆడి ముంబైని విజయపథంలో నడిపించాడు. ఆరంభం నుంచి సిక్స్‌లతో అదరగొట్టిన రోహిత్.. ఖలీల్ వేసిన మూడో ఓవర్లో సిక్స్, 2 ఫోర్లతో 14 పరుగులు రాబట్టాడు. మరో ఓపెనర్ రికిల్‌టన్ (24; 19 బంతుల్లో 3×4, 1×6) కూడా ధాటిగా ఆడడంతో పవర్‌ప్లే పూర్తయ్యేసరికి ముంబై 62/0తో లక్ష్యం దిశగా దూసుకెళ్లింది రికిల్‌టన్‌ను జడేజా ఔట్ చేసినా.. రోహిత్, సూర్యకుమార్ జోరు కొనసాగించారు. రోహిత్ 33 బంతుల్లో అర్ధసెంచరీ అందుకున్నాడు. మరోవైపు సూర్య అదిరే షాట్లు ఆడాడు. నూర్ అహ్మద్ బౌలింగ్‌లో హ్యాట్రిక్ ఫోర్లతో స్కోరుబోర్డు పరుగులెత్తించాడు. 26 బంతుల్లోనే సూర్య అర్ధసెంచరీ పూర్తయింది. 50 తర్వాత లభించిన రెండు జీవనదానాలను ఉపయోగించుకున్న రోహిత్ మరింత చెలరేగాడు. ఇద్దరూ పోటీ పడి సిక్సర్లు బాదడంతో ముంబయి 26 బంతులు మిగిలుండగానే విజయాన్ని అందుకుంది.