ROHIT: చెమటోడుస్తున్న హిట్ మ్యాన్
ఫామ్ లోకి వచ్చేందుకు గంటల తరబడి ప్రాక్టీస్.. పాకిస్తాన్‌కు వెళ్లనున్న హిట్ మ్యాన్;
టీమిండియా టెస్టు కెప్టెన్ రోహిత్ శర్మ కొంతకాలంగా ఫామ్‌లో లేక తీవ్ర ఇబ్బంది పడుతున్నాడు. అయితే మునుపటి ఫామ్ అందుకునేందుకు ఇప్పుడు తెగ కష్టపడుతున్నాడు. దీనికోసం గంటల తరబడి నెట్స్‌లో చెమటోడుస్తున్నాడు. ఇక త్వరలోనే ఛాంపియన్స్ ట్రోఫీ ఉంది. దీంతో హిట్‌మ్యాన్ హార్డ్ వర్క్‌ను మరింత పెంచాడు. ముంబయిలో రంజీ, లోకల్ ప్లేయర్లతో కలిసి ప్రాక్టీస్ చేస్తున్నాడు.
మీడియా ముందుకు హిట్‌మ్యాన్
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ నేడు మధ్యాహ్నం మీడియా ముందుకు రాబోతున్నారు. మధ్యాహ్నం ముంబైలోని వాంఖడే మైదానంవేదికగా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ తో కలిసి మీడియాతో మాట్లడబోతున్నారు. ఈ సందర్భంగా ఛాంపియన్స్ ట్రోఫీ టీమ్‌ను ప్రకటించబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. కొన్ని రోజులుగా డ్రెస్సింగ్ రూమ్‌లో వివాదాలంటూ వస్తోన్న పుకార్లు, సోషల్ మీడియా వార్తలపైనా స్పందించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
పాకిస్తాన్‌కు వెళ్లనున్న రోహిత్ శర్మ!
రోహిత్ శర్మ పాకిస్తాన్‌కు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రతిష్టాత్మక చాంపియన్స్ ట్రోఫీ-2025 ఆరంభోత్సవంలో భారత సారథి పాల్గొననున్నట్లు సమాచారం. కాగా 1996 తర్వాత తొలిసారి పాకిస్తాన్ అంతర్జాతీయ క్రికెట్ మండలి ఈవెంట్‌కు ఆతిథ్యం ఇస్తోంది. వన్డే ఫార్మాట్‌లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీని చివరగా 2017లో నిర్వహించగా.. నాడు పాక్ జట్టు విజేతగా నిలిచింది. ఈ నేపథ్యంలో డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో ఈ ఐసీసీ టోర్నీకి నేరుగా అర్హత సాధించడంతో పాటు నిర్వహణ హక్కులను కూడా దక్కించుకుంది. ఆతిథ్య పాకిస్తాన్‌తో పాటు.. భారత్ వేదికగా 2023లో జరిగిన వన్డే ప్రపంచకప్ ఈవెంట్ ప్రదర్శన ఆధారంగా ఛాంపియన్ ఆస్ట్రేలియా, రన్నరప్ టీమిండియా.. అదే విధంగా టాప్-7లో నిలిచిన న్యూజిలాండ్, సౌతాఫ్రికా, అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, ఇంగ్లండ్ కూడా ఈ టోర్నమెంట్‌కు అర్హత సాధించాయి.