T20 WORLD CUP: సెమీస్ చేరిన టీమిండియా
రోహిత్ శర్మ విధ్వంసకర ఇన్నింగ్స్... సెమీస్ రేసు నుంచి ఆస్ట్రేలియా ఔట్;
టీ 20 ప్రపంచకప్ సూపర్ ఎయిట్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. వన్డే ప్రపంచకప్ 2023లో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంది. ఆస్ట్రేలియా సెమీస్ అవకాశాలు గల్లంతు చేస్తూ టీమిండియా సగర్వంగా సెమీస్‌లో అడుగుపెట్టింది. సెమీస్‌లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ బ్యాట్‌తో విధ్వంసం సృష్టించగా... బౌలర్లు సమష్టిగా రాణించి ఆస్ట్రేలియాకు చెక్ పెట్టారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. రోహిత్ శర్మ 92 పరుగులతో కంగారు బౌలర్లను ఊచకోత కోయడంతో 205 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం ఆస్ట్రేలియా పోరాడినా విజయం మాత్రం దక్కలేదు. కంగారులు నిర్ణీత 20 ఓవర్లలో 181 పరుగులకే పరిమితమైంది. దీంతో 24 పరుగులతో ఘన విజయం సాధించి సెమీస్ చేరింది. సెమీ ఫైనల్లో ఇంగ్లాండ్‌తో టీమిండియా తలపడనుంది.
చెలరేగిన రోహిత్
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా టీమిండియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.రోహిత్ శర్మ 92 పరుగులకు మిగిలిన బ్యాటర్లూ జోరందుకోవడంతో బ్యాటింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 205 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ శివాలెత్తిపోయాడు. కంగారు బౌలర్లను ఊచకోత కోశాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 17 ఏళ్లు పూర్తి చేసుకున్న రోహిత్ శర్మ 19 వేల పరుగులను పూర్తి చేసుకున్నాడు. రోహిత్ విధ్వంసకర బ్యాటింగ్‌కు తోడు మిగిలిన బ్యాటర్లు కూడా రాణించడంతో టీమిండియా కంగారుల ముందు భారీ స్కోరు చేసింది. రోహిత్ శర్మ కేవలం 41 బంతుల్లో ఏడు ఫోర్లు, ఎనిమిది సిక్సర్లతో 92 పరుగులు చేసి కేవలం సెంచరీకి ఎనిమిది పరుగుల దూరంలో అవుటయ్యాడు. స్టార్క్ బౌలింగ్‌లో అయితే రోహిత్ ఒకే ఓవర్‌లో నాలుగు సిక్సర్లు, ఒక ఫోర్ బాదేశాడు. జంపాను కూడా దంచేశాడు. ఈ ప్రపంచకప్‌లో వరుస హ్యాట్రిక్‌లు తీస్తూ గొప్ప బౌలర్ అని భావిస్తున్న కమిన్స్‌ను కూడా ఊచకోత కోశాడు. పాండ్యా, సూర్య, దూబే కూడా బ్యాట్ ఝుళిపించడంతో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో అయిదు వికెట్ల నష్టానికి 205 పరుగుల భారీ స్కోరు చేసింది. పంత్ 15, సూర్య భాయ్ 31, శివమ్ దూబే 28, హార్దిక్ పాండ్యా 27 పరుగులు చేయడంతో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో అయిదు వికెట్ల నష్టానికి 205 పరుగుల భారీ స్కోరు చేసింది.
హెడ్ పోరాడినా...
206 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కంగారులకు ఆదిలోనే గట్టి దెబ్బ తగిలింది. అర్ష్‌దీప్ సింగ్ ఆరంభంలోనే కంగారులను దెబ్బ కొట్టాడు. ఆరు బంతుల్లో ఆరు పరుగులు చేసిన డేవిడ్ వార్నర్‌ను అర్ష్‌దీప్ అవుట్ చేశాడు. ఆ తర్వాత ట్రావిస్ హెడ్‌తో జత కలిసిన ఆసిస్ కెప్టెన్ మిచెల్ మార్ష్ భారత్‌ను భయపెట్టాడు. వీరిద్దరూ భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగి స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ఓవర్‌కు పది పరుగులపైనా జోడిస్తూ ధాటిగా బ్యాటింగ్ చేశారు. ముఖ్యంగా ట్రావిస్ హెడ్... వన్డే ప్రపంచకప్ ఫైనల్‌ను గుర్తు చేస్తూ చెలరేగాడు. వీరద్దరూ ధాటిగా ఆడుతుండడంతో ఆస్ట్రేలియా భారీ లక్ష్యాన్ని ఛేదించేలానే కనిపించింది. వీరిద్దరూ తొమ్మిది ఓవర్లకు 87 పరుగులు జోడించి.... కంగారుల విజయానికి బాటలు వేశారు. అయితే కీలక సమయంలో వికెట్లు కోల్పోవడంతో కంగారులు నిర్ణీత 20 ఓవర్లలో 181 పరుగులకే పరిమితమైంది. దీంతో 24 పరుగులతో ఘన విజయం సాధించి సెమీస్ చేరింది.