SA CAPTIAN: ప్రేక్షక హృదయ విజేత.. లారా వోల్వార్ట్
అద్భుత ఆటతీరుతో ఆకట్టుకున్న లారా.. క్రికెట్ ప్రపంచంలో ప్రశంసల జల్లు
భారత మహిళల జట్టు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచి చరిత్ర సృష్టించింది. భారత అమ్మాయిలు అద్భుతంగా ఆడి దేశ ప్రజల ఆశలను నిలబెట్టారు. సమష్టిగా ఆడి వరల్డ్ కప్ టైటిల్‌ను అందుకుని 'శభాష్' అనిపించుకున్నారు. కానీ దక్షిణాఫ్రికా జట్టు కెప్టెన్ పోరాట పటిమకు క్రికెట్ ప్రపంచం హ్యాట్సాఫ్ చెబుతోంది. వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ నిర్దేశించిన 299 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో దక్షిణాఫ్రికా జట్టుకు ఆదిలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. కానీ ఓ వైపు వికెట్లు పడుతున్నా కెప్టెన్ లారా వోల్వార్డ్ మాత్రం క్రీజులో పాతుకుపోయి ఒంటరి పోరాటం చేసింది. లారా వోల్వార్డ్ కేవలం 98 బంతుల్లో 11 ఫోర్లు, ఒక సిక్సర్‌తో అద్భుతమైన సెంచరీ(101) పరుగులు పూర్తి చేసుకుంది. ఫైనల్ వంటి కీలక మ్యాచ్‌లో ఇంత గొప్పగా పోరాడడం ఆమె అంకితభావానికి నిదర్శనంగా నిలిచింది. లారా వోల్వార్ట్ సెంచరీ సాధించిన సమయంలో దక్షిణాఫ్రికా విజయానికి ఇంకా ఆశలు మిగిలే ఉన్నాయి. ఆమె ఆటతీరు చూసి ఏ క్షణంలోనైనా మ్యాచ్ మలుపు తిరుగుతుందని భావించారు.
26 ఏళ్ల లారా వోల్వార్ట్ అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పటికే ఎన్నో ఘనతలు సాధించింది. 2016లో, 17 ఏళ్ల వయసులోనే ఆమె అంతర్జాతీయ అరంగేట్రం చేయడం విశేషం. కెరీర్ ఆరంభమైన నాలుగు నెలలకే ఐర్లాండ్‌పై వన్డే సెంచరీ (105) సాధించింది. దక్షిణాఫ్రికా తరఫున మహిళల క్రికెట్లోనే కాదు, పురుషుల్లోనూ అత్యంత పిన్న వయసులో శతకం సాధించిన బ్యాటర్‌గా ఆమె రికార్డు నెలకొల్పింది. ఇప్పటిదాకా 119 వన్డేలాడిన లారా..50.69 సగటుతో 5222 పరుగులు చేసింది. ఆమె 83 టీ29ల్లో 34.80 సగటుతో 2088 పరుగులు చేసింది. లారా 4 టెస్టులు కూడా ఆడింది.