SANJU SAMSHAN: ప్లీజ్.. నన్ను వదిలేయండి
రాజస్థాన్ జట్టు నుంచి రిలీజ్ చేయాలని కోరిన సంజు.. యాజమాన్యంతో విభేదాలే కారణమన్న వార్తలు... చెన్నై జట్టులోకి వెళ్తాడన్న ఊహగానాలు;
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వేలానికి ముందు రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) జట్టులో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. జట్టు కెప్టెన్ సంజు శాంసన్ ఫ్రాంచైజీని వీడాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. తనను జట్టు నుంచి విడుదల (రిలీజ్) చేయాలని లేదా మరో జట్టుకు బదిలీ (ట్రేడ్) చేయాలని అతడు యాజమాన్యానికి అధికారికంగా విజ్ఞప్తి చేసినట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ వార్త ఐపీఎల్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సుదీర్ఘ కాలం పాటు ఆ జట్టుకు ఆడుతున్న సంజూ శాంసన్.. ఐపీఎల్ 2026 వేలానికి ముందు తనను వదిలేయాని ఫ్రాంచైజీ యాజమాన్యాన్ని కోరినట్లు వార్తలు వస్తున్నాయి. ఐపీఎల్ 2025 సీజన్ ముగిసిన వెంటనే సంజూ శాంసన్ తన నిర్ణయాన్ని వెల్లడించాడని సమాచారం. అయితే సంజూ విజ్ఞప్తిపై రాజస్థాన్ రాయల్స్ ఇంకా స్పందించలేదని తెలుస్తోంది. ఒకవేళ సంజూ శాంసన్‌ను రాజస్థాన్ వదిలేయాలనుకుంటే అతన్ని ఇతర ఫ్రాంచైజీకి ట్రేడింగ్ చేయవచ్చు. లేదా వేలానికి వదిలేయవచ్చు. రూల్స్ ప్రకారం తుది నిర్ణయం ఫ్రాంచైజీదే. 30 ఏళ్ల సంజూ శాంసన్ మొదట 2013 నుంచి 2015 వరకు రాజస్థాన్ రాయల్స్‌కు ఆడాడు. ఆ తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున రెండు సీజన్లు పాటు ఆడి రాజస్థాన్ రాయల్స్‌కు రీఎంట్రీ ఇచ్చాడు. 2021 నుంచి రాజస్థాన్ రాయల్స్‌కు సంజు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. గత మెగా వేలానికి ముందు ఫ్రాంచైజీ అతడిని ఏకంగా రూ.18 కోట్లకు రిటైన్ చేసుకుని తమ కీలక ఆటగాడిగా ప్రకటించుకుంది. అలాంటి ఆటగాడు ఇప్పుడు జట్టును వీడాలనుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో, సంజు శాంసన్‌ను తమ జట్టులోకి తీసుకునేందుకు చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) ఆసక్తి చూపుతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఒకవేళ సంజు వేలానికి అందుబాటులోకి వస్తే, అతడి కోసం గట్టి పోటీ నెలకొనే అవకాశం ఉంది. ఏదేమైనా, ఈ విషయంపై రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం అధికారికంగా స్పందించాల్సి ఉంది.
ధోనీ వారసుడు ఇతడేనా
ఐపీఎల్ 2025 సీజన్ ముగిసినప్పటి నుంచి చెన్నై టీమ్‌లో ధోనీ తర్వాత వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్‌గా ఎవరు అనేది పెద్ద ప్రశ్నగా మారింది. ఈ స్థానాన్ని భర్తీ చేయడానికి సరైన ప్లేయర్ కోసం టీమ్ చాలా వెతుకుతోంది. ఈ క్రమంలోనే రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ పేరు బలంగా వినిపిస్తోంది. మేనేజ్మెంట్తో విభేదాలు రావడంతో తనను రిలీవ్ చేయాలని అతడు ఇప్పటికే రాజస్థాన్ రాయల్స్‌కి ఫార్మల్గా రిక్వెస్ట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో సంజును సొంతం చేసుకోవాలని చెన్నై పావులు కదుపుతోంది. అతడు ఓ మంచి వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్ మాత్రమే కాదు. కెప్టెన్సీ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. కాబట్టి భవిష్యత్తులో టీమ్‌కు మంచి ఆప్షన్ అవుతాడని చెన్నై భావిస్తున్నట్లు సమాచారం. అయితే సంజు శాంసన్ కోసం చెన్నై చేసిన ఆఫర్‌ను రాజస్థాన్ రాయల్స్ రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. చెన్నై శామ్సన్ను డైరెక్ట్‌గా ట్రేడ్ చేయాలని ఆఫర్ ఇచ్చిందని, అయితే దానికి బదులుగా వేరే ప్లేయర్‌ను ఇవ్వడానికీ ముందుకు రాలేదని కొన్ని రిపోర్ట్స్ పేర్కొన్నాయి.