DHAWAN: అక్కడే నా కెరీర్ ముగిసింది: శిఖర్‌‌ ధావన్

ది వన్'లో ఆసక్తికర విషయాలు... జట్టుకు దూరమైనప్పుడు ద్రవిడ్‌తో మాట్లాడా;

Update: 2025-07-03 05:30 GMT

మ్యాన్ ఆఫ్ ది ఐసీసీ టోర్నెమెంట్స్ అనగానే మనకు గుర్తొచ్చే పేరు శిఖర్ ధావన్. టీంలో నిలకడైన ఆటతీరుతో ప్రత్యేకంగా నిలిచినా వ్యక్తి. ప్రధానంగా కీలకమైన ఐసీసీ టోర్నీలలో అద్భుతమైన ఆటతీరుతో టీమిండియాకు దన్నుగా ఉన్నాడు. కానీ.. క్రికెట్‌కు ధావన్ వీడ్కోలు చెప్పిన విధానం మాత్రం చాల అసహజం. ఫామ్‌లో ఉన్న క్రికెటర్‌ని ఎందుకు పక్కన పెట్టారో తెలీదు. ఆతడు అంత సడన్‌గా రిటైర్మెంట్ ప్రకటించాడో తెలియదు. ఇలాంటి ప్రశ్నలన్నింటికీ ధావన్ తన ఆత్మకథ 'ది వన్'లో ఆసక్తికర సమాధానాలు చెప్పుకొచ్చాడు.

ఇన్నర్ వాయిస్ చెప్పింది

'నేను కెరీర్‌లో ఎక్కువగా హాఫ్‌ సెంచరీలు చేశాను. సెంచరీలు తక్కువే అయినా 70లు ఎక్కువగా ఉండేవి. అయితే, ఎప్పుడైతే ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీ చేశాడో.. అక్కడే నా కెరీర్‌ ముగిసిందని నా అంతరాత్మ నుంచి ఒక ఇన్నర్ వాయిస్ వినిపించింది' అని అన్నాడు. అలాగే 'శుభ్‌మన్ గిల్ ఆ సమయంలో మూడు ఫార్మాట్లలో మంచి ప్రదర్శన చేస్తున్నాడు. అయితే నేను వన్డే జట్టులో మాత్రమే ఉన్నాను. అప్పుడు నా కెరీర్ ఎక్కువ కాలం కొనసాగదని మరోసారి అర్థమైంది' అని చెప్పుకొచ్చాడు.కెరీర్ చివరి దశలో తాను కుంగిపోతానని అనుకున్నారని తెలిపాడు. అయితే, అలా జరగలేదన్నాడు. కీలకమైన ఆ సమయంలో స్నేహితులు, శ్రేయోభిలాషులు మద్దతుగా నిలవడం మర్చిపోలేనన్నాడు. ఇప్పటికీ.. ఆటను ఇంకా ఆస్వాదిస్తున్నానని ధావన్ చెప్పుకొచ్చాడు. టీంలో ప్లేస్ కోల్పోయినప్పుడు రాహుల్ ద్రావిడ్ తో మాట్లాడనని.. ఆయన తనకు మెసేజ్ చేశాడని తెలిపాడు.

 అలా మొదలై..

2004లో అండర్‌-19 వరల్డ్‌ కప్‌లో 3సెంచరీలు చేసిన ధావన్‌ జాతీయ సెలక్టర్ల దృష్టిలో పడ్డాడు. 2010లో వన్డేలలో తొలి అవకాశం వచ్చినా మొదటి మ్యాచ్‌లోనే డకౌటై నిరాశపరిచాడు. ఆ తర్వాత జట్టులోకి వస్తూపోతూ ఉన్నా 2013 నుంచి స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. ఆ ఏడాది ఐసీసీ ట్రోఫీతో రోహిత్‌ శర్మతో కలిసి సంచలన భాగస్వామ్యాలు నెలకొల్పాడు.  అదే ఏడాది ఆస్ట్రేలియాతో మొహాలీ టెస్టులో భారీ శతకంతో రికార్డులు నెలకొల్పడంతో ఇక అప్పట్నుంచి అతడు వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ధోనీ హయాంలో 2013 నుంచి 2019 మధ్య రోహిత్‌, కోహ్లీతో కలిసి ధావన్‌ ఓ వెలుగు వెలిగాడు. 2013, 2017 చాంపియన్స్‌ ట్రోఫీలలో అత్యధిక రన్స్‌ చేసి ‘గోల్డెన్‌ బ్యాట్‌’ అవార్డులు దక్కించుకున్నాడు.

 ఇలా ఫేడ్‌ అవుట్‌

2018 తర్వాత టెస్టు జట్టులో స్థానం కోల్పోయిన ధావన్‌ క్రమంగా పరిమిత ఓవర్ల ఫార్మాట్‌కూ దూరమవుతూ వచ్చాడు. ఆటతో పాటు కుటుంబ సమస్యలతో సతమతమైన అతడిని టెస్టులతో పాటు టీ20లలోనూ సెలక్టర్లు పక్కనబెట్టినా వన్డేలలో మాత్రం తరుచుగా ఆడాడు. ఒక దశలో వెస్టిండీస్‌, శ్రీలంక, జింబాబ్వే వంటి పర్యటనలలో భారత ద్వితీయ శ్రేణి జట్టుకు సారథిగానూ వ్యవహరించాడు. ధావన్‌ చివరిసారిగా 2022లో బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్‌లో ఆడాడు. ఆ తర్వాత శుభ్‌మన్‌ గిల్‌, యశస్వీ జైస్వాల్‌, ఇషాన్ కిషన్ వంటి కుర్రాళ్ల రాకతో సెలక్టర్లు ధావన్‌ను పూర్తిగా పక్కనబెట్టేశారు.

గబ్బర్ విశ్వరూపం

2013, 2017 చాంపియన్స్‌ ట్రోఫీతో పాటు 2015 వన్డే వరల్డ్‌ కప్‌లో భారత్‌ తరఫున అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా ధావన్‌ నిలిచాడు. అంతేగాక ఐసీసీ టోర్నీలలో అత్యంత వేగంగా వెయ్యి పరుగులు పూర్తి చేసిన బ్యాటర్‌. అందుకే అభిమానులు అతడిని ‘మిస్టర్‌ ఐసీసీ’గా పిలుస్తారు. రోహిత్‌-ధావన్‌ ఓపెనింగ్‌ భాగస్వామ్యం 117 ఇన్నింగ్స్‌లలో 5,193 పరుగులు. భారత్‌లో సచిన్‌, గంగూలీ (6,609) తర్వాత ఇదే అత్యధికం.

Tags:    

Similar News