తుది జట్టులో ఆడే అర్హత ఉండి కూడా టీమ్‌లో అవకాశం దక్కకపోతే ఏ ఆటగాడైనా అసహనానికి గురవుతాడని టీమిండియా వెటరన్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ అన్నాడు. ఇలాంటి సమయాల్లో వచ్చిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అభిప్రాయపడ్డాడు. ఆసియా కప్ 2025 కోసం ఎంపిక చేసిన భారత జట్టులో శ్రేయస్ అయ్యర్‌కు చోటు దక్కలేదు. దీనిపై తొలిసారి అయ్యర్ స్పందించాడు. తన వేటుపై మౌనంగా ఉన్న శ్రేయస్ అయ్యర్.. తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో స్పందించాడు. సెలెక్టర్లపై తన అసహనాన్ని వెళ్లగక్కాడు. తుది జట్టులో ఆడే అర్హత ఉండి కూడా అవకాశం ఇవ్వకపోతే ఏ ఆటగాడికైనా మండుతదని తెలిపాడు. "తుది జట్టులో ఆడే అర్హత ఉన్నా.. ఎంపిక చేయకపోతే అసహనం కలుగుతుంది. కానీ అదే సమయంలో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. నిలకడగా రాణిస్తూ జట్టు విజయానికి కృషి చేయాలి. మన పనిని నైతికతతో చేస్తూ వెళ్లాలి. ఎవరో చూస్తున్నారని కాకుండా.. నిబద్ధతతో పని చేసుకుంటూ ముందుకు సాగాలి."అని అయ్యర్ చెప్పుకొచ్చాడు. భారత్ తరఫున వన్డేల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చినా.. ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత విజయంలో కీలక పాత్ర పోషించినా సెలెక్టర్లు అయ్యర్‌ను పట్టించుకోలేదు.