VAIBHAV: బౌలర్ ఎవరైనా భయపడను
క్రికెట్ ప్రపంచంలో వైభవ్ గురించి చర్చే.. శతకం చేసిన తర్వాత వైభవ్ సంచలన వ్యాఖ్యలు;
క్రికెట్ ప్రపంచం.. వైభవ్ సూర్యవంశీ నామస్మరణలో మునిగిపోయింది. ఎక్కడ చూసినా ఈ 14 ఏళ్ల పెను సంచలనం గురించే చర్చ జరుగుతోంది. రాజస్థాన్ రాయల్స్ చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ టాక్ ఆఫ్ ది నేషన్‌గా నిలిచాడు. దేశంలో ఎవర్నీ కదిలించినా.. ఏ సోషల్ మీడియా వేదిక చూసినా.. ఈ 14 ఏళ్ల కుర్రాడి గురించే చర్చ జరుగుతోంది. సూర్యవంశీ ధాటికి 210 పరుగుల భారీ లక్ష్యాన్ని రాజస్థాన్ రాయల్స్ 25 బంతులు మిగిలి ఉండగానే చేధించి 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ సీజన్‌లో 5 వరుస పరాజయాల తర్వాత విజయాన్నందుకుంది. వైభవ్ సూర్యవంశీ సెంచరీతో ఆ జట్టు ఆటగాళ్లు ఎగిరి గంతేసారు. ఎప్పుడూ ప్రశాంతంగా కనిపించే రాహుల్ ద్రవిడ్ సైతం గట్టిగా అరుస్తూ సంబరాలు చేసుకున్నాడు. ఈ శతకం అనంతరం వైభవ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరింత వైరల్‌గా మారాయి.**
బౌలర్ ఎవరనేది చూడను
ఈ శతకంపై వైభవ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. "ఇది చాలా మంచి అనుభూతి. ఇది ఐపీఎల్‌లో నా తొలి సెంచరీ. ఇది నా మూడో ఇన్నింగ్స్. టోర్నమెంట్‌కు ముందు చేసిన ప్రాక్టీస్ ఫలితం ఇక్కడ కనిపించింది. నేను బంతిని చూసి ఆడతాను. జైస్వాల్‌తో బ్యాటింగ్ చేయడం బాగుంది. అతడు నాకు ఏమి చేయాలో చెబుతాడు. పాజిటివ్‌గా ఆలోచించేలా చేస్తాడు. ఐపీఎల్‌లో సెంచరీ సాధించడం నాకు కల. అది ఇప్పుడు నేరవేరింది. నాకు భయం లేదు. నేను పెద్దగా ఆలోచించను. కేవలం నేను ఆడటంపైనే దృష్టి పెడతాను" అని వైభవ్ సూర్యవంశీ చెప్పాడు. వైభవ్ తన సెంచరీతో ఎన్నో రికార్డులను సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలో సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడిగా, అత్యంత వేగంగా సెంచరీ చేసిన బ్యాట్స్‌మన్‌గా అతను నిలిచాడు. క్రిస్‌గేల్ తర్వాత అత్యంత వేగంగా సెంచరీ నమోదు చేసిన ప్లేయర్‌గా వైభవ్ నిలిచాడు. మహ్మద్ సిరాజ్, ఇషాంత్ శర్మ వంటి బౌలర్లును ఎదుర్కొని ధాటిగా ఆడాడు.
అంతా మా నాన్న వల్లే...
‘**నేను ఇప్పుడు ఈ స్థితిలో ఉన్నాను అంటే దానికి నా తల్లిదండ్రులే కారణం. నా భవిష్యత్తు కోసం మా నాన్న తాను చేస్తున్న పనిని వదిలేశాడు. ఎంతో కష్టమైనా వెనకడుగు వేయకుండా మా పెద్దన్న మా ఇంటి బాధ్యతలు తీసుకున్నాడు. మా నాన్న సహాయసహకారాల వల్లే ఇది సాధ్యమైంది’ అని నయా సంచలనం వైభవ్ సూర్యవంశీ అన్నాడు.