MULDER: సువర్ణావకాశాన్ని వదిలేసిన సౌతాఫ్రికా కెప్టెన్
క్వాడ్రపుల్ సెంచరీని వదిలేసిన ముల్దర్.. జట్టు కోసం తృణప్రాయంగా వదిలేసిన కెప్టెన్;
సౌతాఫ్రికా తాత్కాలిక కెప్టెన్ వియాన్ ముల్దర్ టెస్ట్ క్రికెట్లో అత్యంత అరుదైన క్వాడ్రపుల్ సెంచరీ (400) చేసే సువర్ణావకాశాన్ని జట్టు ప్రయోజనాల కోసం తృణప్రాయంగా వదిలేశాడు. జింబాబ్వేతో జరుగుతున్న రెండో టెస్ట్‌లో ముల్దర్ రెండో రోజు తొలి సెషన్లోనే ట్రిపుల్ సెంచరీ పూర్తి చేసి, క్వాడ్రపుల్ సెంచరీకి 33 పరుగుల దూరంలో (367 నాటౌట్) ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేశాడు. ముల్దర్ తీసుకున్న ఈ అత్యంత సాహసోపేత నిర్ణయానికి యావత్ క్రికెట్ ప్రపంచం ఆశ్చర్యానికి గురైంది. టెస్ట్ క్రికెట్లో ఎప్పుడో కాని ఇలాంటి సువర్ణావకాశం రాదు. ముల్దర్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే అవకాశాన్ని చేజేతులారా జారవిడిచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో ముల్దర్ ఉన్న ఫామ్‌ను బట్టి చూస్తే మరో 20 బంతుల్లో ఈజీగా క్వాడ్రపుల్ సెంచరీ పూర్తయ్యేది. అయితే అతను అనూహ్యంగా లంచ్ విరామం తర్వాత తిరిగి బరిలోకి దిగకుండా ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేశాడు.
లారా ఒక్కడే
టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు ఒకే ఒక్కరు క్వాడ్రపుల్ సెంచరీ చేశారు. 2004లో విండీస్ దిగ్గజం బ్రియాన్ లారా ఇంగ్లండ్‌పై ఈ ఘనత సాధించాడు. టెస్ట్‌ల్లో అత్యధిక పరగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో లారా (400 నాటౌట్), మాథ్యూ హేడెన్ (380), బ్రియాన్ లారా (375), మహేళ జయవర్దనే (374) మాత్రమే ముల్దర్ కంటే ముందున్నారు. క్వాడ్రపుల్ మిస్ చేసుకున్నప్పటికీ ముల్దర్ మరో ఘనత సాధించాడు. విదేశీ గడ్డపై అత్యధిక టెస్ట్ స్కోర్ చేసిన ఆటగాడిగా చరిత్రకెక్కాడు. అలాగే సౌతాఫ్రికా తరఫున ఓ టెస్ట్ మ్యాచ్‌లో అత్యధిక స్కోర్ చేసిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. గతంలో ఈ రికార్డు గ్రేమ్ స్మిత్ పేరిట ఉండేది. స్మిత్ 2003లో ఓ టెస్ట్ మ్యాచ్‌లో 362 పరుగులు (277 & 85) చేశాడు.
విదేశీ టెస్టుల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్లు
367 - వియాన్ ముల్డర్ (SA) vs ZIM, బులవాయో, 2025
337 - హనీఫ్ మొహమ్మద్ (PAK) vs WI, బార్బడోస్, 1958
336 - వాలీ హమ్మండ్ (ENG) vs NZ, ఆక్లాండ్, 1933
334 - మార్క్ టేలర్ (AUS) vs PAK, పెషావర్, 1998
334 - సర్ డాన్ బ్రాడ్‌మాన్ (AUS) vs ENG, హెడింగ్లీ, 1930
ఈ మ్యాచ్‌లో ముల్దర్ 334 బంతుల్లో 49 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 367 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఓవర్‌నైట్ స్కోర్ 264 వద్ద రెండో రోజు బరిలోకి దిగిన ముల్దర్.. తొలి సెషన్లోనే ట్రిపుల్ సెంచరీ పూర్తి చేశాడు. ముల్దర్ వన్డే తరహాలో బ్యాటింగ్ చేస్తూ వేగంగా ట్రిపుల్ సెంచరీ పూర్తి చేశాడు. జట్టు ప్రయోజనాలే ముఖ్యమనుకునే ఇలాంటి నాయకుడిని చరిత్రలో చూడలేమని సోషల్‌మీడియా వేదికగా కామెంట్లు పెడుతున్నారు. విశ్వవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులచే కీర్తించబడుతున్నాడు. నిస్వార్థ నాయకుడని జేజేలందుకుంటున్నాడు.