T20 WORLD CUP: టీ20 ప్రపంచ కప్ నుంచి బంగ్లాదేశ్ ఆవుట్!
బీసీబీ సంచలన నిర్ణయం... అమీనుల్ ఇస్లాం, ‘బుల్బుల్ కి ఘోర అవమానం... క్రీడల సలహాదారు ఆసిఫ్ వ్యాఖ్య
బంగ్లాదేశ్ క్రికెట్ చరిత్రలో తొలి టెస్ట్ శతకవీరుడిగా నిలిచిన అమీనుల్ ఇస్లాం ‘బుల్బుల్’ ఒకప్పుడు దేశానికి గర్వకారణంగా గుర్తింపు పొందారు. దాదాపు 25 ఏళ్ల క్రితం భారత్‌తో జరిగిన బంగ్లాదేశ్ తొలి టెస్ట్ మ్యాచ్‌లో సాధించిన శతకం ఆయన కెరీర్లో చిరస్థాయిగా నిలిచింది. అయితే తాజాగా చోటుచేసుకున్న పరిణామాలు బుల్బుల్కు తీవ్ర అవమానకరంగా మారాయి. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) చరిత్రలో తొలిసారిగా, ఆయన అధ్యక్షుడిగా ఉన్న సమయంలో జాతీయ జట్టు ఒక ఐసీసీ టోర్నమెంట్ నుంచి తప్పుకునే పరిస్థితి తలెత్తింది. ఈ వివాదానికి ప్రధాన కారణంగా బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వంలోని క్రీడల సలహాదారు ఆసిఫ్ నజ్రుల్ తీసుకున్న కఠిన వైఖరి మారింది. భద్రతా కారణాలను ‘జాతీయ ప్రతిష్ఠ’తో ముడిపెట్టి భారత్‌లో పర్యటించేందుకు అవకాశం లేదని ఆయన స్పష్టం చేయడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఈ నిర్ణయంతో బీసీబీ మాత్రమే కాకుండా దేశ క్రికెట్ భవిష్యత్తే ప్రమాదంలో పడే పరిస్థితి ఏర్పడింది.
తాత్కాలిక ప్రభుత్వ నిర్ణయం వల్ల బంగ్లాదేశ్ క్రికెట్‌కు ఆర్థికంగా కూడా భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉందని అంచనాలు వెలువడుతున్నాయి. బంగ్లాదేశ్ టీ20 వరల్డ్ కప్ నుంచి తప్పుకుంటే, ఐసీసీ నుంచి వచ్చే వార్షిక ఆదాయంలో సుమారు 325 కోట్ల బంగ్లాదేశీ టాకాలు (దాదాపు 27 మిలియన్ డాలర్లు) నష్టం జరిగే ప్రమాదం ఉంది. బ్రాడ్‌కాస్టింగ్ హక్కులు, స్పాన్సర్‌షిప్‌లు, ఇతర వాణిజ్య ఆదాయాలను కలిపితే మొత్తం ఆర్థిక సంవత్సరంలో నష్టం 60 శాతం లేదా అంతకంటే ఎక్కువగా ఉండొచ్చని క్రీడా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక ఈ పరిణామాలు భారత్–బంగ్లాదేశ్ ద్వైపాక్షిక క్రికెట్ సంబంధాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. ఆగస్టు–సెప్టెంబర్‌లో జరగాల్సిన భారత జట్టు బంగ్లాదేశ్ పర్యటన రద్దయ్యే అవకాశాలు కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సిరీస్‌కు సంబంధించిన టీవీ హక్కుల విలువ కనీసం 10 ద్వైపాక్షిక సిరీస్‌లకు సమానమని భావిస్తుండటంతో, అది రద్దైతే బీసీబీకి భారీ ఆర్థిక నష్టం తప్పదని చెబుతున్నారు.
ఇదిలా ఉండగా, ఫిబ్రవరి 12న బంగ్లాదేశ్‌లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆసిఫ్ నజ్రుల్ రాజకీయ ప్రభావం తగ్గవచ్చని అంచనాలు వినిపిస్తున్నాయి. అయితే ఈ మొత్తం వ్యవహారంలో బీసీబీ అధ్యక్షుడు బుల్బుల్ ఎదుర్కొన్న పరాభవం మాత్రం ఆయన జీవితకాలం మరిచిపోలేని చేదు అనుభవంగా మిగిలిపోతుందని క్రీడా వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. బీసీబీకి చెందిన ఒక వర్గం తెలిపిన వివరాల ప్రకారం, సమావేశంలో ఎక్కువగా మాట్లాడింది ఆసిఫ్ నజ్రుల్ మాత్రమేనని, బుల్బుల్ చాలా అరుదుగా స్పందించారని పేర్కొన్నారు. ఆటగాళ్లు దాదాపుగా మౌనంగా ఉన్నారని, సీనియర్ ఆటగాడు తమీమ్ ఇక్బాల్‌కే ఇలాంటి పరిస్థితి ఎదురైతే తమకు ఇంకా కఠిన పరిణామాలు ఎదురవుతాయనే భయం స్పష్టంగా కనిపించిందని తెలిపారు. సమావేశం అనంతరం బుల్బుల్ తీవ్ర నిరాశలో ఉన్నారని, నజ్రుల్‌ను ఒప్పించడంలో పూర్తిగా విఫలమయ్యారని బీసీబీలోని వర్గాలు ఆరోపిస్తున్నాయి.
ఇటీవలి పరిణామాలు చూస్తే ప్రపంచ రాజకీయాలు భాగస్వామ్యాల నుంచి ప్రతీకార ధోరణి వైపు మళ్లుతున్నాయనే భావన బలపడుతోంది. శాంతి, సహకారం పేరుతో ఏర్పడిన వేదికలే ఇప్పుడు శక్తి రాజకీయాలకు వేదికలుగా మారుతున్నాయి. ఈ పరిస్థితులు రాబోయే రోజుల్లో అంతర్జాతీయ సమీకరణాలను మరింత సంక్లిష్టం చేసే అవకాశముంది. ప్రపంచ రాజకీయాల్లో శాంతికన్నా శక్తి ఆధిపత్యమే ప్రధానంగా మారుతున్న పరిస్థితి ఇది.