T20 WORLD CUP: ప్రపంచకప్ వేట విజయంతో మొదలు
అమెరికాపై టీమిండియా విజయం... పోరాడిన యూఎస్ఏ జట్టు... 29 రన్స్ తేడాతో భారత్ గెలుపు... రాణించీన సూర్యకుమార్ యాదవ్
ఐసీసీ టీ20 వరల్డ్‌కప్ 2026 టైటిల్ వేటను భారత్ విజయంతో ఆరంభించింది. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో అమెరికా జట్టును 29 పరుగుల తేడాతో ఓడించింది.కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అద్భుత ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకోగా, అనంతరం భారత బౌలర్లు సమష్టిగా రాణించి విజయంలో ప్రధాన పాత్ర పోషించారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన అమెరికా కెప్టెన్ మోనాంక్ పటేల్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. యూఎస్ఏ పేస్ బౌలర్లు భారత బ్యాటింగ్‌ను తీవ్రంగా ఇబ్బంది పెట్టారు. ఓపెనర్లుగా బరిలోకి దిగిన అభిషేక్ శర్మ, శివమ్ దుబే ఇద్దరూ ఖాతా తెరవకుండానే గోల్డెన్ డక్‌గా వెనుదిరగడం టీమిండియాకు గట్టి షాక్ ఇచ్చింది. ఆ తర్వాత వచ్చిన ఇషాన్ కిషన్, తిలక్ వర్మ కూడా భారీ స్కోరు చేయలేక తక్కువ పరుగులకే ఔటయ్యారు. దీంతో అభిమానుల్లో ఆందోళన మొదలైంది.
టాప్ ఆర్డర్ పూర్తిగా కుప్పకూలిన వేళ రింకూ సింగ్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్‌లపై ఆశలు పెట్టుకున్న అభిమానులకు నిరాశే ఎదురైంది. వీరంతా ఒక్కొక్కరుగా పెవిలియన్ చేరడంతో భారత జట్టు ఒక దశలో తీవ్ర ఒత్తిడిలో పడింది. అయితే ఈ క్లిష్ట సమయంలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ క్రీజ్‌కు అంటిపెట్టుకుని నిలబడి బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ అద్భుత ఇన్నింగ్స్‌తో 161-9 పరుగులు చేసింది. 162 పరుగులతో బరిలోకి దిగిన యూఎస్ఏను భారత జట్టు 132 పరుగులకు కట్టడి చేసింది. దాంతో టీమిండియా 29 పరుగుల తేడాతో విజయం సాధించింది. కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ ఆఖరి వరకూ నిలబడి ఒంటరి పోరాటంతో 84 పరుగులు చేసి జట్టు స్కోర్‌ను 161కి తీసుకెళ్లాడు.
రాణించిన బౌలర్లు
162 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన యూఎస్ఏ జట్టును టీమిండియా పేసర్లు ఆరంభంలోనే దెబ్బ తీశారు. ఆఖరి నిమిషంలో జట్టులోకి వచ్చిన మొహమ్మద్ సిరాజ్ అద్భుత బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. అర్ష్‌దీప్ సింగ్ కూడా రాణించడంతో యూఎస్ఏ జట్టు కేవలం 13 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయింది. పవర్‌ప్లేలోనే అమెరికా జట్టు కేవలం 31 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయింది. సిరాజ్, అర్ష్‌దీప్ ఇద్దరూ కలిసి తొలి ఆరు ఓవర్లను పూర్తిగా నియంత్రించడంతో యూఎస్ఏ బ్యాటర్లు పరుగులు తీయలేకపోయారు. నాలుగు ఓవర్లకే మూడు వికెట్లు కోల్పోయిన అమెరికా జట్టును మిలింద్ కుమార్, సంజయ్ కృష్ణమూర్తి కొంతవరకు ఆదుకున్నారు.
నాలుగు ఓవర్లకే మూడు వికెట్లు కోల్పోయిన జట్టును మిలింద్ కుమార్ - సంజయ్ కృష్ణమూర్తి ముందుకు తీసుకెళ్లారు. ఈ ఇద్దరూ కలిసి నాలుగో వికెట్‌కు 58 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 34 బంతుల్లో మూడు ఫోర్లు, 1 సిక్సర్‌తో 34 పరుగులు చేసిన మిలింద్ కుమార్ వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో స్టంప్ అవుట్ అయ్యాడు. దాంతో 12 ఓవర్లకు యూఎస్ఏ 71 పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోయింది.అప్పటికే మ్యాచ్ చేజారిపోయినప్పటికీ సంజయ్ కృష్ణమూర్తి కాసేపు పోరాడాడు. నిర్ణీత 20 ఓవర్లలో అమెరికా జట్టు 8 వికెట్ల నష్టానికి 132 పరుగులకే పరిమితమైంది. దీంతో భారత్ 29 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.