TEAM INDIA: టీమిండియా "మిషన్ టీ 20 ప్రపంచకప్"
ఆసియా కప్‌లో టీమిండియా పక్కా వ్యూహం... టీ 20 ప్రపంచకప్ లక్ష్యంగా మార్పులు.. గౌతం గంభీర్- సూర్యా పక్కా ప్రణాళికలు
ఆసియా కప్ టీ20 టోర్నీలో భారత్ బోణీ కొట్టింది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. తొమ్మిది వికెట్ల తేడాతో గెలుపొందింది. టాస్ ఓడిపోయి తొలుత బ్యాటింగ్‌కు దిగిన యూఏఈ జట్టు 13.1 ఓవర్లలో 57 పరుగులకు కుప్పకూలింది. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ నాలుగు వికెట్లతో రాణించాడు. శివమ్ దుబే మూడు, బుమ్రా, అక్షర్‌పటేల్, వరుణ్ చక్రవర్తి తలో వికెట్ తీశారు. ఇక 58 పరుగుల లక్ష్య ఛేదనలో బరిలోకి వచ్చిన భారత్ కేవలం 4.3 ఓవర్లలోనే ఒక వికెట్ కోల్పోయి 60 పరుగులు చేసింది. తొమ్మిది వికెట్ల తేడాతో యూఏఈని ఓడించింది. అయితే ఈ మ్యాచులో గౌతీ-సూర్యా జోడీ ప్రయోగాలతో ముందుకు సాగింది. వచ్చే టీ 20 ప్రపంచకప్ లక్ష్యంగా ఈ జోడీ ప్రయోగాలు ఆరంభించింది.
తొలి మ్యాచ్‌లోనే ప్రయోగాలు
వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్ సన్నాహకంగా భావిస్తోన్న ఆసియా కప్ తొలి మ్యాచ్‌తోనే ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ - కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తమ మార్క్‌ను చూపించారు. యూఏఈ వంటి చిన్న జట్టు అయినా సరే పూర్తిస్థాయి బలంతోనే బరిలోకి దింపి విజయం సాధించారు. బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులతో మొదలుపెట్టారు. చిన్ననాటి స్నేహితులు అభిషేక్ శర్మ - శుభ్‌మన్ గిల్ ఓపెనర్లుగా వచ్చారు. జితేశ్ శర్మను తీసుకుంటారని భావిస్తే.. సంజుకే ఛాన్స్ ఇచ్చారు. బ్యాటింగ్ చేసే అవకాశం రాకపోయినా అతడికి జట్టులో స్థానం కల్పించడంతో కాన్ఫిడెన్స్ పెంచినట్లైంది. ఇక వన్‌డౌన్‌లో కెప్టెన్ సూర్య వచ్చాడు. దుబాయ్ పిచ్‌లు స్పిన్‌కు అనుకూలం. అలాగని పేస్నూ తక్కువ చేయడానికి లేదు. తొలి మ్యాచ్‌లో కేవలం ఒకేఒక్క స్పెషలిస్ట్ పేసర్‌ను మాత్రమే ఆడించారు. కుల్దీప్ ఛాన్స్ కొట్టేసి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు.
కొత్త బంతి పాండ్యాకు
జస్ప్రీత్ బుమ్రాతోపాటు పేస్ ఆల్రౌండర్లుగా ఉన్న హార్దిక్ పాండ్య, శివమ్ దూబెను మేనేజ్మెంట్ ఆడించింది. అనూహ్యంగా కెప్టెన్ సూర్య కొత్త బంతిని హార్దిక్‌కు ఇచ్చాడు. పసికూనపై బుమ్రాను ఆడించరనుకుంటే... పవర్‌ప్లేలోనే మూడు ఓవర్లు వేయించడం గమనార్హం. జట్టులో ఎంతమంది ఆల్‌రౌండర్లు ఉంటే అంత బలం. ఇప్పటికే టీమ్ఇండియాలో ముగ్గురు ఆల్‌రౌండర్లు ఉండగా.. ఇప్పుడు అభిషేక్ శర్మ కూడా చేరాడు. చిన్న జట్టు కాబట్టి పెద్ద టెన్షన్ లేకుండా బౌలింగ్ చేశాడు. పాక్‌తో పోరులో ఎలా ఆడతాడో చూడాలి. రవీంద్ర జడేజా లోటును తీరుస్తూ అక్షర్ పటేల్ తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. మ్యాచ్‌కు, ప్రతి సిరీస్‌కు భిన్నంగా ఆలోచనలు చేయడం గౌతమ్ గంభీర్‌కు అలవాటు. అది జట్టు ఫలితాలపై తాత్కాలికంగా ప్రభావం చూపినా.. సుదీర్ఘకాలంలో మెరుగ్గా ఉంటాయనేది అతడి భావన. ఇప్పుడు ఆసియా కప్‌లో పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ నుంచి కాస్త ప్రతిఘటన తప్పితే.. మిగతా జట్ల నుంచి ముప్పు ఉండకపోవచ్చు. అయితే భారత జట్టు ముందుముందు కూడా ఈ ప్రయోగాలు కొనసాగిస్తుందేమో చూడాలి.