TEST: నేటి నుంచే అయిదో టెస్ట్.. పిచ్‌పైనే అందరి చూపు
పిచ్ క్యురేటర్ ద్వంద్వ వైఖరి... క్యూరేటర్పై ఫైర్ అయిన గంభీర్... ఐదో టెస్టుపై పెరుగుతున్న ఉత్కంఠ;
అండర్సన్-టెండూల్కర్ సిరీస్ వివాదాస్పదంగా మారింది. ఐదు టెస్టుల సిరీస్‌లో తొలి రెండు మ్యాచులు జరిగిన తీరు వేరు. ఆ తర్వాత రెండు టెస్టుల్లో ‘ప్లేయర్ల’ మధ్య నెలకొన్న ‘స్లెడ్జింగ్’ ఫైట్ వేరు. ఇప్పుడు ఆఖరి టెస్టుకొచ్చేసరికి ‘సిబ్బంది’ నేరుగా రంగంలోకి దిగినట్లుంది. మ్యాచ్ ఆరంభానికి ముందే అగ్గి రాజేస్తూ ‘ఓవల్ పిచ్ క్యురేటర్’ వ్యవహరించిన తీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇంగ్లాండ్ - భారత్ జట్ల మధ్య గురువారం నుంచి ఐదో టెస్టు ప్రారంభం కానుంది. ఇప్పటికే 2-1 ఆధిక్యంలో ఉన్న ఆతిథ్య జట్టు సిరీస్‌పై కన్నేయగా.. ఆఖరి టెస్టులో గెలిచి సమం చేయాలని టీమ్ఇండియా భావిస్తోంది. లార్డ్స్ మ్యాచ్ నుంచి ఆటగాళ్ల మధ్య మొదలైన లడాయి.. మాంచెస్టర్‌లో ముందస్తు ‘డ్రా’ వివాదం వరకూ వెళ్లింది. ఇక ఓవల్‌లో ఈసారి మాత్రం పిచ్ క్యురేటర్ ఫోర్టిస్ అగ్గిని రాజేశాడు. అతడి ద్వంద్వవైఖరే ఇప్పుడు భారత క్రికెట్ అభిమానులకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది.
టీమిండియాతో ఇలా..
పిచ్‌కు దూరంగా ఉండి చూడాలంటూ భారత కోచింగ్ బృందానికి ఓవల్ మైదానం సిబ్బంది చెప్పారు. ఈ విషయంలో క్యురేటర్ లీ ఫోర్టిస్ - భారత ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. 'మేమేం చేయాలో నువ్వు చెప్పకూడదు. నువ్వు గ్రౌండ్స్మెన్లో ఒకడివి. అంతకుమించి ఏమీ కాదు' అని గంభీర్ అన్నాడు. తనను దూషించడంపై మ్యాచ్ రిఫరీకి ఫిర్యాదు చేస్తానని ఫోర్టిస్ హెచ్చరించగా.. 'నీ ఇష్టమొచ్చింది చేసుకో' అని భారత కోచ్ గట్టిగా బదులిచ్చాడు. ఆ తర్వాత ఎవరికి వారు తమ పనులు చూసుకొనేందుకు చెరో దిక్కుకు వెళ్లిపోయారు. పిచ్ క్యురేటర్ ఇలా ప్రవర్తించిన దాఖలాలను తామెప్పుడూ చూడలేదని భారత బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ కూడా అసహనం వ్యక్తం చేశాడు.
ఇంగ్లాండ్‌తో అలా..
ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసేందుకు ప్రధాన కారణం ఇదే. భారత ప్రధాన కోచ్‌తో అలా వ్యవహరించిన ఫోర్టిస్ తమ జట్టు కోచ్‌తో మాత్రం గతంలో విభిన్నంగా ప్రవర్తించాడు. టీమిండియా సిబ్బందిని పిచ్‌కు 2.5 మీటర్ల దూరం నుంచి చూడాలని చెప్పిన అతడు మాత్రం మెక్కల్లమ్తో కలిసి పిచ్ పైనే సంభాషించడం ఇప్పుడు భారత అభిమానులకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. గత యాషెస్ సిరీస్ సందర్భంగా చోటుచేసుకున్న ఆ ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఇదేం ద్వంద్వవైఖరి అంటూ మండిపడుతున్నారు. ‘మీ కోచ్‌తో అలా మాట్లాడిన నువ్వు.. ప్రత్యర్థి కోచ్‌లకు కనీసం మర్యాద ఇవ్వవా?’ అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. మాంచెస్టర్‌లో ఇంగ్లాండ్ జట్టుపై తీవ్ర విమర్శలు వచ్చినా సరే వారి ప్రవర్తన మారలేదని ఈ ఘటనే రుజువు చేసిందని క్రికెట్ విశ్లేషకులూ వ్యాఖ్యలు చేశారు. ప్రాక్టీస్ సెషన్ అనంతరం ఐదో టెస్ట్‌ను ఉద్దేశించి బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా పిచ్ క్యూరేటర్‌తో చోటు చేసుకున్న వాగ్వాదంపై స్పందించాడు. గొడవకు గల కారణాన్ని తెలియజేశాడు. 'పిచ్ క్యూరేటర్ లీ ఫోర్టిస్ హద్దులు దాటి ప్రవర్తించాడు. పిచ్‌కు 2.5 మీటర్ల దూరంలో నిల్చోండని, రోప్ బయటకు వెళ్లండని హెడ్ కోచ్‌కు గ్రౌండ్ సిబ్బంది చెప్పడం ఇప్పటి వరకు నేను చూడలేదు. ఇది ఏ మాత్రం సరికాదు. అందుకే గంభీర్ ఆగ్రహానికి గురయ్యాడు. అయితే ఈ ఘటనపై టీమిండియా ఎలాంటి ఫిర్యాదు చేయలేదు.