IPL: మోదీ స్టేడియాన్ని పేల్చేస్తాం
అహ్మదాబాద్ స్డేడియానికి బెదిరింపులు... ఐపీఎల్‌పై ఆపరేషన్ సిందూర్ ప్రభావం;
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. ఈక్రమంలోనే గుజరాత్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియానికి బాంబు బెదిరింపులు వచ్చాయి. స్టేడియాన్ని బాంబులతో పేల్చేస్తామని గుర్తు తెలియని వ్యక్తులు హెచ్చరించారు. ఉత్సాహంగా ఐపీఎల్ కొనసాగుతున్న వేళ బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపింది. ఈ క్రమంలో పాక్ పేరుతో ఈ మెయిల్ బెదిరింపు రాగా.. భద్రతా సంస్థలు అప్రమత్తమయ్యాయి. ‘ఆపరేషన్ సిందూర్’ పరిణామాల తర్వాత పాక్ పేరుతో హెచ్చరికలు రావడంతో మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. ఈ మెయిల్ ‘పాకిస్థాన్’ పేరుతో పంపారు. ఆ తర్వాత భద్రతా సంస్థలు అప్రమత్తమయ్యాయి. ఈ విషయంపై దర్యాప్తు ప్రారంభించారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఈ బెదిరింపు వచ్చింది. కాబట్టి ఈ విషయాన్ని తీవ్రంగా తీసుకున్నారు. ఈ బెదిరింపులను అధికారులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. గుజరాత్ పోలీసులు, సైబర్ క్రైమ్ నిపుణుల బృందం బెదిరింపు ఈమెయిల్ ఎక్కడి నుంచి వచ్చిందో ఆరా తీస్తున్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో ఎక్కడి నుంచి పంపారో తెలుసుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి.
ఢిల్లీ మ్యాచ్ జరిగేనా..?
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్‌లోని తొమ్మిది ఉగ్రస్థావరాలపై భారత సైన్యం మెరుపుదాడులు చేసింది. ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పలు ఎయిర్‌పోర్ట్‌లను మూసివేసింది. భారీగా విమానాలు కూడా రద్దయ్యాయి. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఆయా ఎయిర్‌పోర్టులను తెరువొద్దని కేంద్రం ఆదేశించింది. ఈ నిర్ణయం ఐపీఎల్‌పై ప్రభావం పడే అవకాశాలున్నాయి. ధర్మశాల పంజాబ్ కింగ్స్‌కు హోంగ్రౌండ్ కాగా.. ప్రస్తుతం ధర్మశాలలో రెండు మ్యాచులు ఆడాల్సి ఉంది. పంజాబ్ కింగ్స్- ఢిల్లీ క్యాపిటల్స్ గురువారం ధర్మశాలలో మ్యాచ్ జరుగనుంది. ఈ నెల మే 11న పంజాబ్-ముంబై ఇండియన్స్ ధర్మశాలలో మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్ కోసం ముంబై నేడు అక్కడకు చేరుకోవాల్సి ఉంది. అయితే, ధర్మశాల ఎయిర్‌పోర్టు మూసివేత కారణంగా ఇప్పుడు ప్రత్యామ్నాయ మార్గాలపై ముంబై దృష్టి సారించింది. చండీగఢ్ ఎయిర్‌పోర్టు మూసేయడంతో జట్టు మొదట ఢిల్లీకి చేరుకొని.. రోడ్డు మార్గం ద్వారా ధర్మశాలకు వెళ్లే అవకాశాలున్నాయి.