tickets: మ్యాచ్ టికెట్ల కోసం ఎగబడ్డ జనం
టికెట్ల కోసం భారీగా తరలివచ్చిన అభిమానులు
భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరగనున్న టీ 20 సిరీస్‌కు సంబంధించిన టికెట్ల కోసం భారీగా అభిమానులు ఎగబడ్డారు. టీమ్ఇండియా, దక్షిణాఫ్రికా జట్ల మధ్య అయిదు టీ20ల సిరీస్ జరగనుంది. మొదటి మ్యాచ్ డిసెంబర్ 9న కటక్ వేదికగా నిర్వహించనున్నారు. ఒడిశా క్రికెట్ అడ్మినిస్ట్రేషన్ తక్కువ సంఖ్యలో టికెట్లను కౌంటర్లలో విక్రయానికి (ఆఫ్‌లైన్) ఉంచింది. దీంతో టికెట్ల కోసం అభిమానులు పోటీపడ్డారు. టికెట్ కౌంటర్లు తెరుచుకోకముందే ఉదయం నుంచీ మైదానం బయట వేల సంఖ్యలో అభిమానులు పొడవాటి క్యూలైన్లలో వేచి ఉన్నారు. కౌంటర్లు తెరుచుకోగానే టికెట్ల కోసం ఎగబడ్డారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఒడిశా క్రికెట్ అసోసియేషన్ ఎక్కువ సంఖ్యలో టికెట్లను వారి సభ్యులు, వీఐపీలకు కేటాయించి.. చాలా తక్కువ టికెట్లను మాత్రమే కౌంటర్లలో విక్రయానికి ఉంచడం వల్లే ఈ సమస్య తలెత్తిందని పలువురు ఆరోపిస్తున్నారు. టికెట్ల ధరలు రూ.700 నుంచి రూ.20,000 మధ్య ఉన్నాయి. అయితే ఫ్యాన్స్ కోసం తక్కువ సంఖ్యలో టికెట్లు మాత్రమే విడుదల చేసినట్లు తెలుస్తోంది. దక్షిణాఫ్రికాతో టీమ్ఇండియా టీ20 మ్యాచ్‌లు కటక్, ముల్లాన్‌పుర్, ధర్మశాల, లఖ్‌నవూ, అహ్మదాబాద్ వేదికగా జరగనున్నాయి. ఫిబ్రవరి, మార్చిలో జరగనున్న టీ20 వరల్డ్ కప్ 2026 సన్నాహకాల్లో భాగంగా ఈ సిరీస్ ఇరు జట్లకు కీలకం కానుంది.