SRH: నయా స్టార్స్‌.. అనికేత్‌, జీషాన్

అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న ఇద్దరు ఆటగాళ్లు...;

Update: 2025-03-31 02:30 GMT

ఢిల్లీతో జరిగిన మ్యాచులో మరో ఇద్దరు అద్బుతమైన ప్లేయర్స్ వెలుగులోకి వచ్చారు. ఢిల్లీతో జరిగిన మ్యాచ్ ఓడినా.. బ్యాటర్ అనికేత్ వర్మ 41 బంతుల్లో 74 పరుగులు చేసి ప్రశంసలు అందుకున్నాడు. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో 102 మీటర్ల రేంజ్ సిక్స్ బాది వావ్ అనిపించాడు. ఇక బౌలింగ్‌లో స్పిన్నర్ జీషాన్ అన్సారీ 3 కీలక వికెట్లు పడగొట్టి అందరిని అబ్బురపరిచాడు. హైదరాబాద్‌ ప్రాంఛైజీ.. అనికేత్‌ని రూ. 30 లక్షలు, జీషాన్‌ని రూ. 40 లక్షలకు కొనుగోలు చేశారు. హైదరాబాద్‌ బ్యాటింగ్‌ను అనికేత్ వర్మ నిలబెట్టాడు. ఢిల్లీలో ఏ బౌలర్ ను వదలకుండా ఆరంభం నుంచి బౌండరీలతో విరుచుకుపడ్డాడు. 41 బంతుల్లోనే 74 పరుగులు చేశాడు. ఈ 23 ఏళ్ళ బ్యాటర్ ఇన్నింగ్స్ లో 5 ఫోర్లు, 6 సిక్సర్ల ఉండడం విశేషం. అనికేత్ కొడుతుంటే మరో ఎండ్ లో క్లాసన్ చూస్తూ ఉండిపోయాడు. సన్ రైజర్స్ 150 పరుగుల మార్క్ చేరుకుందంటే అనికేత్ కారణం. అంతకముందు లక్నో సూపట్ జయింట్స్ తో జరిగిన మ్యాచ్ లోనూ తన హిట్టింగ్ తో అలరించాడు. 13 బంతుల్లోనే 5 సిక్సర్లతో 36 పరుగులు చేశాడు.

జీషాన్ అదుర్స్‌

ఢిల్లీతో జరిగిన ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ స్పిన్నర్ ఆడమ్ జంపా లేకుండానే బరిలోకి దిగింది. దీంతో స్పిన్ భారాన్ని యువ స్పిన్నర్ జీషన్ పై పడింది. ఆడేది తొలి మ్యాచ్ అయినా జీషాన్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. నాలుగు ఓవర్లలో మూడు వికెట్లు పడగొట్టాడు. పదో ఓవర్ లో డుప్లెసిస్,  ఫ్రేజర్-మెక్‌గుర్క్ వికెట్లు పడగొట్టిన అతను.. 12 ఓవర్ రెండో బంతికి రాహుల్ ను బౌల్డ్ చేశాడు. జీషన్, అనికేత్ వర్మ అద్భుత ప్రదర్శనతోనే హైదరాబాద్ భారీ ఓటమిని తప్పించుకుంది.

వరుస ఓటములపై సమీక్ష చేస్తా: కమిన్స్

ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓటమిపై కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కీలక వ్యాఖ్యలు చేశాడు. గత రెండు మ్యాచ్‌ల్లో తమకు ఏది కలిసి రాలేదని, వరుస ఓటములపై సమీక్ష చేస్తామని చెప్పాడు. చెత్త షాట్లే తమ పతనాన్ని శాసించాయన్న కమిన్స్.. జట్టులో మిగతా ఆప్షన్స్‌ను పరిశీలిస్తామని అన్నాడు. అయితే ఇది ఘోర పరాజయమని నేను అనుకోను. టోర్నీ ఆరంభంలోనే ఉన్నామని, నెక్ట్స్ మ్యాచ్‌లో పుంజుకుంటామన్నాడు.

అదే మాకు కలిసొచ్చింది: అక్షర్ పటేల్

వైజాగ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో SRHపై ఢిల్లీ క్యాపిటల్స్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ క్రమంలో DC కెప్టెన్ అక్షర్ పటేల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ప్రణాళికలకు తగ్గట్లు రాణించి విజయం సాధించామని చెప్పాడు. పవర్ ప్లేలో మిచెల్ స్టార్క్‌తో అదనంగా మరో ఓవర్ వేయించడం తమకు కలిసొచ్చిందన్నాడు. ఈ మ్యాచ్‌లో మిచెల్ స్టార్క్ 5/35తో సన్‌రైజర్స్ హైదరాబాద్ పతనాన్ని శాసించాడు.

Tags:    

Similar News