VAIBHAV: కొత్త చరిత్ర సృష్టించేందుకు వైభవ్ సిద్ధం
టీమిండియాలోకి భారత్ టీన్ సంచలనం... భారత జట్టు తరపున త్వరలో అరంగేట్రం... పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించే ఛాన్స్
భారత క్రికెట్లో కొత్త సంచలనం సృష్టిస్తున్న యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ పేరు ఇప్పుడు జాతీయ స్థాయిలో మార్మోగుతోంది. చిన్న వయసులోనే అసాధారణ ప్రతిభను కనబరుస్తూ అభిమానులను ఆకట్టుకున్న ఈ కుర్రాడు, త్వరలోనే చరిత్ర సృష్టించే అంచున నిలిచాడు. టీమ్ ఇండియా తరఫున అరంగేట్రం చేసే అత్యంత పిన్న వయస్కుడిగా నిలిచే అవకాశం అతని ముందుంది. ఇప్పటివరకు ఈ రికార్డు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట ఉండగా, ఇప్పుడు ఆ గౌరవం వైభవ్ సూర్యవంశీకి దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. క్రికెట్ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, త్వరలో జరగనున్న ఐర్లాండ్ పర్యటనలో వైభవ్‌కు జాతీయ జట్టులో చోటు దక్కే అవకాశాలు బలంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బీసీసీఐ సెలక్షన్ కమిటీ సిద్ధం చేసిన షార్ట్‌లిస్ట్‌లో అతని పేరు ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి. అధికారిక ప్రకటన ఇంకా వెలువడకపోయినా, అతని ఎంపిక దాదాపు ఖాయం అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఐపీఎల్ ముగిసిన కొద్ది రోజులకే భారత్ జట్టు ఐర్లాండ్ పర్యటనకు వెళ్లనుండగా, ఈ సిరీస్ ద్వారా వైభవ్ అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టే అవకాశముంది.
ఐపీఎల్లో ఊచకోత
ఇప్పటికే దేశవాళీ క్రికెట్లో, అలాగే ఐపీఎల్ వేదికపై వైభవ్ తన ప్రతిభను ఘనంగా చాటుకున్నాడు. కేవలం 15 ఏళ్ల వయసులోనే అతను ప్రదర్శిస్తున్న ఆత్మవిశ్వాసం, షాట్ల ఎంపిక, ఆటపై ఉన్న పట్టు నిపుణులను సైతం ఆశ్చర్యపరుస్తోంది. ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో అతను ఆడిన మ్యాచ్‌ల్లో చాలా వరకు దూకుడైన ఇన్నింగ్స్‌లు ఆడుతూ తన ప్రత్యేకతను నిరూపించాడు. హైదరాబాద్‌పై మ్యాచ్ మినహా మిగతా మ్యాచ్‌ల్లో అతని బ్యాటింగ్ ఆకట్టుకుంది. ఇంత చిన్న వయసులోనే ఇంతటి పరిపక్వతతో ఆడటం అరుదైన విషయం అని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వైభవ్ ఎంపికకు బీసీసీఐ వర్గాలు కూడా సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. సెలక్టర్లు అతని ఆటతీరును సమగ్రంగా పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ముఖ్యంగా ఎమర్జింగ్ ఆసియా కప్‌లో అతను చూపిన ప్రతిభ సెలక్షన్ కమిటీని ఆకట్టుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా, ఇటీవల అతను వయస్సుకు సంబంధించిన నిబంధనలను కూడా పూర్తి చేసిన నేపథ్యంలో జాతీయ జట్టులోకి ఎంపికకు అర్హత సాధించాడు.
ఇక ఐర్లాండ్ పర్యటనలో అతను మెరుగైన ప్రదర్శన చేస్తే, తరువాత జరగనున్న జింబాబ్వే సిరీస్‌లో కూడా అతనికి అవకాశం దక్కే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అంటే, ఇది కేవలం అరంగేట్రం మాత్రమే కాకుండా, అతని అంతర్జాతీయ కెరీర్‌కు బలమైన పునాది కావచ్చు. అతని ప్రతిభను దృష్టిలో ఉంచుకుని, భవిష్యత్తులో టీమ్ ఇండియాలో కీలక ఆటగాడిగా ఎదిగే సామర్థ్యం ఉన్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం భారత పురుషుల జట్టులో అత్యంత పిన్న వయసులో అరంగేట్రం చేసిన ఆటగాడిగా సచిన్ టెండూల్కర్ పేరు చరిత్రలో నిలిచింది. ఆయన 16 ఏళ్ల వయసులో ఈ ఘనత సాధించారు. ఇప్పుడు వైభవ్ ఆ రికార్డును అధిగమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా మొత్తం భారత క్రికెట్ చరిత్రలో అత్యంత పిన్న వయసులో అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన ఆటగాడిగా మహిళా క్రికెటర్ షఫాలీ వర్మ పేరు ఉంది. ఆమె 15 ఏళ్ల 7 నెలల 27 రోజుల వయసులోనే భారత్ తరఫున అరంగేట్రం చేసింది. వైభవ్ రికార్డుల కోసం క్రికెట్ ప్రపంచం ఎదురుచూస్తోంది.