Virat Kohli: టీ20 క్రికెట్‌లో చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ
టీ20ల్లో 100వ సారి 50 కంటే ఎక్కువ స్కోరు అందుకున్న టీమిండియా స్టార్;
టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ ఐపీఎల్‌లో సోమవారం రాత్రి పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్‌లో చెలరేగిపోయాడు. కేవలం 31 బంతుల్లోనే అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో మొత్తం 77 పరుగులు బాది ఆర్సీబీ గెలుపులో కీలకపాత్ర పోషించాడు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ టీ20 ఫార్మాట్ క్రికెట్‌లో అత్యంత కీలక మైలురాయిని చేరుకున్నాడు.
టీ20 క్రికెట్‌లో 50 పరుగులు లేదా అంతకంటే ఎక్కువ స్కోర్లు సాధించిన ఏకైక భారత బ్యాట్స్‌మెన్‌గా కోహ్లీ నిలిచాడు. పంజాబ్‌పై హాఫ్ సెంచరీతో పొట్టి క్రికెట్ ఫార్మాట్‌లో 100వ సారి 50 కంటే ఎక్కువ స్కోరును అందుకున్నాడు. ఇందులో 92 అర్ధ సెంచరీలు, 8 సెంచరీలు ఉన్నాయి.
టీ20 క్రికెట్‌లో ఎక్కువసార్లు 50కి పైగా స్కోర్లు చేసిన ఆటగాళ్ల జాబితాలో వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం క్రిస్ గేల్ అగ్రస్థానంలో ఉన్నాడు. క్రిస్ గేల్ మొత్తం 110 సార్లు 50కిపైగా స్కోర్లు చేశాడు. రెండవ స్థానంలో నిలిచిన ఆసిస్ ఆటగాడు డేవిడ్ వార్నర్ 109 సార్లు ఈ మైలురాయిని అందుకున్నాడు. విరాట్ కోహ్లీ 3వ స్థానంలో నిలిచాడు. కోహ్లీ తర్వాత పాకిస్థాన్ ఆటగాడు బాబర్ ఆజం (98), జాస్ బట్లర్ (86) వరుసగా నాలుగు, ఐదవ స్థానాల్లో నిలిచారు.
కాగా గత రాత్రి పంజాబ్ కింగ్స్‌పై కోహ్లీ 77 పరుగులు బాదాడు. కోహ్లీ ఇన్నింగ్స్‌లో 11 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. ఒక ఎండ్‌లో మిగతా ఆటగాళ్లు పెద్దగా రాణించలేకపోయినప్పటికీ కోహ్లీ అద్భుతమైన షాట్లతో అలరించాడు. పంజాబ్ బౌలర్లపై సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడ్డాడు.
బ్యాటింగ్ అదిరిపోయింది..
ఐపీఎల్(IPL) 17వ సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) బోణీ కొట్టింది. చిన్నస్వామి వేదికగా పంజాబ్ కింగ్స్(PBKS)తో జరిగిన మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో బెంగళూరు విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. పంజాబ్ కెప్టెన్ శిఖర్ ధావన్ 45 , జితేశ్ శర్మ 27, సామ్ కరన్ 23, శశాంక్ 21 పరుగులు చేశారు. బెంగళూరు బౌలర్లలో... సిరాజ్, మాక్స్‌వెల్ తలో రెండు తీయగా, యశ్ దయాల్, జోసెఫ్ ఒక్కోవికెట్ తీశారు. అనంతరం బ్యాటింగ్ చేసిన బెంగళూరు 19.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. విరాట్ కోహ్లీ 77 పరుగులతో వీరవిహారం చేశాడు. చివర్లో దినేశ్ కార్తిక్ 28, లామ్రార్ 17 చెలరేగి ఆడి బెంగళూరును గెలిపించారు. పంజాబ్ బౌలర్లలో రబాడ, హర్‌ప్రీత్ బ్రార్ తలో రెండు వికెట్లు తీశారు.