ROHIT SHARMA: ఆస్ట్రేలియాకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యాం
టీ 20 ప్రపంచకప్ రోజులను గుర్తు చేసుకున్న రోహిత్ శర్మ;
భారత్ వేదికగా జరిగిన 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో టీమిండియా ఓటమి.. భారత అభిమానులను శోకసంద్రంలో ముంచేసింది. టోర్నీ మొత్తం అద్భుత ఆటతీరును ప్రదర్శించిన భారత క్రికెట్ జట్టు ఫైనల్లో ఆసీస్ జట్టుపై అనూహ్యంగా ఓడింది. టీమిండియా జోరును చూస్తే 12 ఏళ్ళ తర్వాత వరల్డ్ గెలుస్తుందని ఆశించిన అభిమానులకు నిరాశే ఎదురైంది. 241 పరుగుల లక్ష్యంతో దిగిన ఆసీస్ జట్టు ప్రారంభంలో మూడు వికెట్లు కోల్పోయినా హెడ్(137), లబుషేన్(58) భారీ భాగస్వామ్యంతో ఆరోసారి వరల్డ్ కప్ గెలిచింది. ఈవిజయంతో భారత ఆటగాళ్లు తీవ్ర నిరాశకు గురయ్యారు. అయితే ఈ ఓటమికి ఆసీస్ పై రివెంజ్ తీర్చుకున్నామని రోహిత్ వెల్లడించాడు. " వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా మమ్మల్ని ఓడించింది. దీనికి ప్రతిఫలంగా ఆస్ట్రేలియాకు ఏదైనా రివెంజ్ రూపంలో ఒక బహుమతి ఇవ్వాలని అనుకున్నాం. 2024 టీ20 వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియాతో మ్యాచ్ కు ముందు డ్రెస్సింగ్ రూమ్‌లో అందరూ అదే మాట్లాడుకుంటున్నారు. ఆ మ్యాచ్ గెలిస్తే ఆస్ట్రేలియా ఈ టీ20 వరల్డ్ కప్ నుంచి నిష్క్రమిస్తుందని మా మనసులో అనుకున్నాం" అని రోహిత్ అన్నారు.
ఆస్ట్రేలియా మీద కోపం
‘ఆస్ట్రేలియా మీద కోపం సహజంగానే ఉంటుంది. వన్డే వరల్డ్ కప్-2023 ట్రోఫీని వాళ్లు మనకు దూరం చేశారు. అందుకే మాకు లోలోపల చాలా కోపం ఉంది. నవంబర్ 19న మనకు కప్పు రాకుండా చేశారు కంగారూలు. ప్లేయర్లకే కాదు.. మొత్తం దేశానికి ఆసీస్ టీమ్ అంటే కోపం ఉంటుంది. అందుకే వాళ్లకో మంచి రిటర్న్ గిఫ్ట్ అవ్వాలని అనుకున్నా. ఇవన్నీ మైండ్‌లో నడుస్తూ ఉంటాయి. అయితే క్రీజులోకి అడుగుపెట్టాక ఇవేవీ పట్టించుకోను. టోర్నమెంట్ నుంచి ఆసీస్‌ను బయటకు పంపాలి లాంటి ఆలోచనలతో బ్యాటింగ్ చేయను. జట్టు విజయం గురించే ఆలోచిస్తుంటా. డ్రెస్సింగ్ రూమ్‌లో మాత్రం వీళ్లను బయటకు పంపాల్సిందే.. అప్పుడే అసలు మజా’ అని రోహిత్ చెప్పుకొచ్చాడు.