Neeraj chopra : ఎవరీ నీరజ్ చోప్రా.. చిన్న వయసులోనే ఇండియన్ ఆర్మీకి..!
నీరజ్ చోప్రా.. ఒలంపిక్స్ లో గోల్డ్ మెడల్ కొట్టి 130 కోట్లకి పైగా భారతీయుల ఆశలను నెరవేర్చాడు. చరిత్రలో తన పేరును సువర్ణ అక్షరాలతో లిఖించుకున్నాడు.;
నీరజ్ చోప్రా.. ఒలంపిక్స్ లో గోల్డ్ మెడల్ కొట్టి 130 కోట్లకి పైగా భారతీయుల ఆశలను నెరవేర్చాడు. చరిత్రలో తన పేరును సువర్ణ అక్షరాలతో లిఖించుకున్నాడు. ఇప్పుడు యావత్ దేశం మొత్తం ఇతడి గురించే మాట్లాడుకుంటుంది. జావెలిన్ త్రో విభాగంలో ఏకంగా 87.58 మీటర్లు విసిరి గోల్డ్ మెడల్ సాధించాడు ఈ 23 ఏళ్ల కుర్రాడు. అథ్లెటిక్స్ విభాగంలో భారత్‌కు స్వర్ణపతకం రావడం వందేళ్లలో ఇదే మొదటిసారి కావడం విశేషం.
అయితే ఇంతకీ ఎవరీ నీరజ్ చోప్రా అని అప్పుడే సెర్చ్ చేయడం మొదలు పెట్టారు నెటిజన్లు.. నీరజ్ చోప్రా 24 డిసెంబర్ 1997లో హర్యానా రాష్ట్రంలోని పానిపట్ జిల్లాలోని కందారా గ్రామంలో జన్మించాడు. చంఢీఘర్‌లోని డీఏవీ కాలేజ్‌లో చదువుకున్న నీరజ్ చిన్న వయసులోనే ఇండియన్ ఆర్మీకి సెలక్ట్ అయ్యాడు. ప్రస్తుతం భారత సైన్యంలో నాయక్ సుబేదార్‌గా పనిచేస్తున్నాడు.. 2018 ఏషియన్ గేమ్స్‌లో జావెలిన్ త్రో ఫైనల్లో 88.06 మీటర్లు విసిరి చరిత్ర సృష్టించి స్వర్ణం గెలిచి హీరో అయ్యాడు.
టోక్యో ఒలంపిక్స్ లో 87.58 మీటర్లు విసిరినా, నీరజ్ జాతీయ రికార్డు మాత్రం అంతకన్నా 88.07గా ఉంది. టోక్యో ఒలంపిక్స్ కంటే ముందు.. ఏషియన్ గేమ్స్ 2018,16లో స్వర్ణం, కామన్ వెల్త్ గేమ్స్ 2018లో స్వర్ణం గెలుచుకున్నాడు. ఇదిలావుండగా 2020 టోక్యో ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించినందుకు గాను నీరజ్ చోప్రాకి రూ. 75 లక్షలను భారత ప్రభుత్వం, 6 కోట్ల రూపాయలు, గ్రూప్ 1 ఉద్యోగాన్ని హర్యానా ప్రభుత్వం నజరానాగా ప్రకటించాయి. కాగా కరోనా లాంటి విపత్కరమైన సమయంలో పీఎం సహాయనిధికి రెండు లక్షల రూపాయలను విరాళంగా ఇచ్చాడు నీరజ్ చోప్రా.