WPL: ఢిల్లీకి నిరాశ మిగిలుస్తూ ఆర్సీబీ "అద్వితీయం"
డబ్ల్యూపీఎల్ టైటిల్ విజేత ఆర్సీబీ... రెండోసారి కప్పు బెంగళూరు కైవసం..ఫైనల్లో మరోసారి ఢిల్లీకి తప్పని నిరాశ
మహిళా ప్రీమియర్ లీగ్ (WPL) 2026 సీజన్ ముగింపు అద్భుతమైన మలుపులతో, ఉత్కంఠభరిత పోరాటంతో క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించింది. వడోదర వేదికగా జరిగిన ఈ హై-వోల్టేజ్ ఫైనల్ పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని ఛేదించి, మహిళల ప్రీమియర్ లీగ్‌లో రెండోసారి ఛాంపియన్‌గా నిలిచింది. కెప్టెన్ స్మృతి మంధాన వీరోచిత ఇన్నింగ్స్ జట్టును విజయతీరాలకు చేర్చగా, ఢిల్లీ క్యాపిటల్స్‌కు మాత్రం మరోసారి ఫైనల్ గండం తప్పలేదు.
భారీ స్కోర్ల మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుదే పైచేయి. స్మృతి మంధాన (87; 41 బంతుల్లో 12×4, 3×6), జార్జియా వోల్ (79; 54 బంతుల్లో 14×4) వీరవిహారం చేయడంతో గురువారం డబ్ల్యూపీఎల్-4 ఫైనల్లో ఆర్సీబీ 6 వికెట్ల తేడాతో దిల్లీ క్యాపిటల్స్‌పై విజయం సాధించింది. జెమీమా (57; 37 బంతుల్లో 8×4), లారా వోల్వార్ట్ (44; 25 బంతుల్లో 3×4, 2×6) మెరవడంతో మొదట దిల్లీ 4 వికెటకు 203 పరుగులు చేసింది. లిజెలి (37; 30 బంతుల్లో 3×4, 3×6) షినెలి (35 నాటౌట్; 15 బంతుల్లో 4×4, 2×6) కూడా మెరిశారు. స్మృతి, వోల్ జంట రెండో వికెట్‌కు 92 బంతుల్లో 165 పరుగులు జోడించడంతో లక్ష్యాన్ని బెంగళూరు 19.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది .ఫైనల్ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో 203 పరుగుల భారీ స్కోరును బోర్డుపై ఉంచింది. 4 వికెట్లు కోల్పోయి భారీ స్కోరును చేసింది. ఫైనల్ ఒత్తిడిని ఏమాత్రం లెక్కచేయకుండా మొదటి నుంచే బౌలర్లపై విరుచుకుపడింది. 204 పరుగుల లక్ష్యం అంటే మహిళా క్రికెట్లో అది కూడా ఫైనల్ మ్యాచ్‌లో అత్యంత కష్టతరమైందిగా భావించారు. అయితే, బెంగళూరు బౌలర్లు మధ్యలో కొన్ని వికెట్లు తీసి కట్టడి చేసినప్పటికీ, ఢిల్లీ బ్యాటర్ల ధాటికి స్కోరు బోర్డు పరుగులు తీసింది.
20ల్లో రెండొందలపై లక్ష్యాన్ని ఛేదించడం ఎప్పుడైనా, ఎక్కడైనా ఎంతో కష్టమే. ఫైనల్ అయితే ఇంకా ఒత్తిడి ఉంటుంది. కానీ కెప్టెన్ స్మృతి మంధాన, జార్జియా వోల్ల నిర్దాక్షిణ్య విధ్వంసంతో 204 పరుగుల లక్ష్యాన్ని బెంగళూరు ఛేదించేసింది. నిజానికి రెండో ఓవర్లోనే ప్రమాదకర గ్రేస్ హారిస్ (9)ను ఔట్ చేయడం ద్వారా ఆర్సీబీని ఒత్తిడిలోకి నెట్టేట్లే కనిపించింది దిల్లీ. కానీ ఆ జట్టు సంతోషం ఎంతో సేపు నిలవలేదు. మరో ఓపెనర్ స్మృతి, జార్జియా వోల్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. దిల్లీ బౌలింగ్‌ను తుత్తునియులు చేస్తూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. చివరి ఓవర్ల వరకు మ్యాచ్ ఊగిసలాడింది. 19వ ఓవర్లో సెట్ బ్యాటర్ స్మృతి మంధాన అవుట్ కావడంతో మ్యాచ్‌లో ఉత్కంఠ నెలకొంది. ఆ సమయంలో బెంగళూరుకు గెలుపు కోసం చివరి ఓవర్లో 10 పరుగులు అవసరమయ్యాయి. ఒత్తిడిలో కూడా బెంగళూరు బ్యాటర్లు సంయమనం కోల్పోకుండా ఆడి, 19.4 ఓవర్లలోనే 204/4 పరుగులు చేసి విజయాన్ని ఖాయం చేసుకున్నారు. ఈ సీజన్ ప్రారంభం నుంచి ఆర్సీబీ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడింది. లీగ్ దశలో ఆడిన 8 మ్యాచ్‌లలో 6 విజయాలు నమోదు చేసింది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. 12 పాయింట్లతో టేబుల్ టాపర్‌గా నిలిచిన ఆర్సీబీ, లీగ్ దశలో ఢిల్లీ, ముంబై చేతుల్లో ఓడిపోయింది. ఫైనల్లో మాత్రం ఢిల్లీపై ప్రతీకారం తీర్చుకుంది.