HYD: హైదరాబాద్ లో పెరుగుతున్న వాయు కాలుష్యం
ఢిల్లీతో సమానంగా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్.. కాలుష్య నివారణ చర్యలు చేపట్టాలంటున్న పర్యావరణ అధికారులు;
హైదరాబాద్ లో వాయు కాలుష్యం పెరుగుతోంది. పెరుగుతున్న వాయు కాలుష్యంతో హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. హైదరాబాద్ వాతావరణంలో కీలక మార్పులు చోటు చేసుకుంటుండడంపై సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. హైదరాబాద్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఒక్కసారిగా పడి పోవడం భయాందోళనకు గురి చేస్తోంది. హైదరాబాద్ మహానగరానికి గతంలో నగర శివారుల్లో పారిశ్రామిక ప్రాంతాలు ఉండేవి. కానీ నేడు అవి నగరం మధ్యలోకి వచ్చేశాయి. అంటే.. నగరంలో అవి అంతర్భాగమయ్యాయి. అలాగే మహానగరం రోజు రోజుకు విస్తరిస్తుంది. ఇక నగరంలో ప్రధాన రహదారులు మాత్రమే కాదు.. చిన్న చిన్న దారుల్లో సైతం భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. దీంతో వాయి కాలుష్యం భారీగా పెరిగిపోతుంది. ఇది ఒక్కటే కాదు.. హైదరాబాద్ మహానగరంలో వివిధ రకాల కాలుష్యాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. కానీ ఈ కాలుష్యాన్ని నియింత్రించే విషయంలో.. ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని పర్యావరణ వేత్తలు విమర్శిస్తున్నారు. నగరంలో ట్రాఫిక్ వ్యవస్థ తీవ్ర అస్తవ్యస్తంగా ఉంది. గతంలో ట్రాఫిక్ పోలీసులు నగర రహదారులపై విధులు నిర్వహించే వారు. కానీ నేడు ఆ పరిస్థితి అయితే లేదు. వారు సైతం చలానాలు రాసే పనిలో నిమగ్నమై పోయారు. దీంతో ట్రాఫిక్ నియంత్రించే విధులను వారు పూర్తిగా విస్మరించారని పర్యావరణ వేత్తలు మండిపడుతున్నారు. దీంతో వాయు, శబ్ద కాలుష్యం మహానగరంలో పెచ్చురిల్లుతోందని చెబుతున్నారు.
311కి పడిపోయిన నాణ్యత సూచి
హైదరాబాద్ నగరాన్ని వాయు కాలుష్య బూచి వణికిస్తోంది. పెరుగుతున్న చలి, పొగమంచు, కాలుష్యంతో గాలి నాణ్యత పడిపోతూ డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. సనత్‌నగర్‌లో ఆదివారం సాయంత్రం వాయు నాణ్యత సూచీ 311కు పడిపోయింది. గాలిలో దుమ్ము, ధూళి కణాలు పెరగడంతో బొల్లారం, హెచ్‌సీయూ, ఇక్రిశాట్, పాశమైలారం వంటి ప్రాంతాల్లో ఎక్యూఐ ప్రమాదకరస్థాయులకు చేరుతోంది. ఇప్పటికే నగరంలో పలు ప్రాంతాల్లో గాలిలో నాణ్యత ప్రమాణాలు పడిపోతుండటం, పెరుగుతున్న కాలుష్యం కారణంగా భవిష్యత్‌లో ఢిల్లీ తరహా పరిస్థితులు హైదరాబాద్‌లో ఏర్పడే ప్రమాదముంటుందని పర్యావరణ వేత్తలు ఆందోళన వెలిబుచ్చుతున్నారు. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 200 దాటితే ఆరోగ్యానికి హాని అని.. వాయు నాణ్యత తగ్గితే చిన్నారులు, వయోవృద్ధులు శ్వాసకోశ వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు.
ఎంత ఉండాలంటే..?
నగరాల్లో వాయు నాణ్యత సూచీ 0-50 మధ్యలో ఉంటే గాలి నాణ్యత బాగునన్నట్లని కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు నివేదికలు వెల్లడిస్తున్నాయి. కానీ.. గాలిలో వ్యాపించే కొన్ని రకాల వాయువులు, వాహనాల పొగ, ఫ్యాక్టరీల కాలుష్యం, దుమ్ము, ధూళి కారణంగా వాయు నాణ్యత పడిపోతుందని పర్యావరణ శాస్త్ర వేత్తలు చెబుతున్నారు. హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో రాత్రి వేళల్లో గాలిలో నాణ్యత తగ్గిపోతున్నా.. నివారణకు కాలుష్య నియంత్రణ బోర్డు ఎలాంటి చర్యలూ చేపట్టట్లేదనే విమర్శలున్నాయి. అయితే.. కాలుష్య నియంత్రణ అధికారులు మాత్రం హైదరాబాద్‌లో వాయు కాలుష్యం అంత ప్రమాదకరస్థాయిలో లేదని చెబుతున్నారు. హైదరాబాద్‌లో 14 ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్‌లున్నాయని, గంట గంటకూ వాటి ద్వారా వాయు నాణ్యత వివరాలు సేకరిస్తునట్లు తెలిపారు. 14 కేంద్రాల సమీపంలో ఎక్కడైనా ఎదైనా కాల్చినప్పుడు వచ్చే పొగ వల్ల ఆ సమయంలో మాత్రమే గాలి నాణ్యత తగ్గుతుందని, ఆ తర్వాత పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకుంటాయని వివరించారు. గూగుల్ ప్లే స్టోర్‌లో సమీర్ యాప్‌లో నగరంలోని ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ వివరాలు ప్రతి ఒక్కరు చూసుకోవచ్చని అధికారులు వెల్లడించారు.