SAJJANAR: ఇన్ఫ్లుయెన్సర్లకు సజ్జనార్ మరో హెచ్చరిక
మోసపోవద్దంటూ ప్రజలకు సూచన
సోషల్ మీడియా విస్తరణతో పాటు మోసాల రూపాలు కూడా రోజురోజుకు మారుతున్నాయి. ఒకప్పుడు ఫోన్ కాల్స్, ఈమెయిల్స్ ద్వారా జరిగే మోసాలు ఇప్పుడు ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్బుక్ వంటి సోషల్ మీడియా వేదికలపైకి మారాయి. తాజాగా ‘లక్కీ డ్రా’ల పేరుతో జరుగుతున్న మోసాలు హైదరాబాద్‌లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేస్తూ హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. సోషల్ మీడియాలో కనిపించే ఆడంబరమైన రీల్స్, ఆకర్షణీయమైన హామీలకు మోసపోకుండా జాగ్రత్తగా ఉండాలని ఆయన ప్రజలను కోరారు.
మా దృష్టిలో ఉందన్న సజ్జనార్
ఇన్స్టాగ్రామ్, ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు కార్లు, బైకులు, ప్లాట్లు, ఖరీదైన గ్యాడ్జెట్లు, డీజేలు వంటి విలువైన బహుమతులు ఇస్తామని ప్రచారం చేస్తూ లక్కీ డ్రాల పేరుతో మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసుల దృష్టికి వచ్చిందని సీపీ సజ్జనార్ తెలిపారు. రీల్స్‌లో భారీ బిల్డప్ ఇచ్చి, నిజ జీవితంలో అమాయక ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసి మాయమవుతున్నారని ఆయన హెచ్చరించారు. ఈ తరహా మోసాలు గణనీయంగా పెరిగాయని, వాటిపై నిఘా పెంచినట్లు చెప్పారు.
సీపీ సజ్జనార్ మాట్లాడుతూ, గతంలో బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్ల దందా జోరుగా సాగిందని, వాటిపై ప్రభుత్వాలు, పోలీసులు కఠిన చర్యలు తీసుకోవడంతో ఆ దారిలో ఆదాయం తగ్గిన కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు ఇప్పుడు లక్కీ డ్రాల పేరిట కొత్త వేషాలతో ప్రజల ముందు వస్తున్నారని తెలిపారు. ‘బెట్టింగ్ యాప్‌లు కాదు… లక్కీ డ్రాలు’ అంటూ పేరు మార్చి, అదే తరహా మోసాలకు పాల్పడటం గమనించామని ఆయన పేర్కొన్నారు. అమాయకుల ఆశలను ఆసరాగా చేసుకుని డబ్బులు వసూలు చేస్తూ ప్రజలను నిండా ముంచుతున్న ఇన్ఫ్లుయెన్సర్లపై చట్టప్రకారం చర్యలు తప్పవని సీపీ సజ్జనార్ స్పష్టం చేశారు.