BJP: జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థిగా లంకల దీపక్ రెడ్డి
బీజేపీ కార్యాలయంలో కొట్టుకున్న బీసీ సంఘాల నేతలు
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా లంకల దీపక్ రెడ్డి పేరును ఖరారు చేశారు. గతంలో ఇదే స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయినప్పటికీ.. పార్టీ ఆయనకే మరోసారి అవకాశం కల్పించింది. మూడు ప్రధాన పార్టీలు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు అభ్యర్థులను ప్రకటించటంతో ఎన్నికల ప్రచారం ఊపందుకోనుంది. వీరపనేని పద్మ, విక్రమ్ గౌడ్, జూటూరు కీర్తిరెడ్డి పేర్లు ప్రముఖంగా వినిపించాయి. కానీ చివరకు దీపక్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించారు. ప్రస్తుతం ఆయన సెంట్రల్ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే స్థానం నుంచి పోటీ చేసి దీపక్ రెడ్డి ఓడిపోయారు. 25 వేల ఓట్లు సాధించి మూడోస్థానంలో నిలిచారు. దీంతో అన్ని సమీకరణాలను పరిగణలోనికి తీసుకొని దీపక్ రెడ్డికే మరోసారి అవకాశం కల్పించారు. ఈ మేరకు బీజేపీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఇక బీఆర్ఎస్ నుంచి దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ సతీమణి సునీత, కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. మూడు పార్టీలు అభ్యర్థులను ప్రకటించటంతో ప్రచారం ఉపందుకోనుంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు న్యూఢిల్లీ తీసుకు వెళ్లి.. బీజేపీ అధిష్టానం ముందు ఉంచారు. అధిష్టానం లంకల దీపక్ రెడ్డిని ఎంపిక చేసింది. మరోవైపు అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్.. ఎన్నికల ప్రచారంలో తనదైన శైలిలో దూసుకు పోతున్నారు. రూపొందించి..
నవంబర్ 11న పోలింగ్..
జూబ్లీహిల్స్ సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అనారోగ్య కారణాల వల్ల ఈ ఏడాది జూన్ 8న కన్నుమూశారు. దీంతో ఈ స్థానానికి ఉపఎన్నిక అనివార్యమైంది. దివంగత ఎమ్మెల్యే సేవలను, ప్రజల్లో ఆయనకున్న అభిమానాన్ని దృష్టిలో ఉంచుకుని బీఆర్ఎస్ అధిష్టానం ఆయన సతీమణి సునీతను రంగంలోకి దింపింది. గతంలో ఇదే స్థానం నుంచి ఎంఐఎం తరపున పోటీ చేసి ఓడిపోయి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరిన నవీన్ యాదవ్కు హస్తం పార్టీ టికెట్ ఇచ్చింది.
కొట్టుకున్న బీసీ సంఘాల నేతలు
బీజేపీ తెలంగాణ కార్యాలయంలో బీసీ నేతల ఫైటింగ్ తీవ్ర కలకలం రేపింది. నాంపల్లి పార్టీ ఆఫీస్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య ఎదుటే బీసీ సంఘాల నేతలు బాహాబాహీకి దిగారు. జూనియర్ సీనియర్ వివాదం తలెత్తడంతో నేతలు ఒకరిపై మరొకరు చేయిచేసుకున్నారు. ఈనెల 18న బీసీ జాక్ నిర్వహించ తలపెట్టిన బంద్కు మద్దతు ఇవ్వాలని బీజేపీని కోరేందుకు ఆర్.కృష్ణయ్యతో పాటు బీసీ సంఘాల నేతలు బీజేపీ కార్యాలయానికి వచ్చారు. రామచందర్ రావుతో కలిసి ప్రెస్ మీట్ పెట్టే సమయంలో జూనియర్ అయి ఉండి ఫోటోలకు ఎలా ముందుకు వెళ్తావ్ అని ఒకరినొకరు తిట్టుకుంటూ బీసీ నేతలు ఘర్షణకు దిగినట్లు తెలుస్తోంది. దీంతో ఒక్కసారిగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఘర్షణకు దిగిన నేతలను మిగతా బీసీ నాయకులు అడ్డుకున్నారు. కొట్లాటకు దిగిన నేతలపై మిగతా బీసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.