తెలంగాణ జాగృతి రాజకీయ పార్టీగా మారబోతోందని ఎమ్మెల్సీ కవిత ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు స్పందించారు. KA పాల్ కూడా పార్టీ పెట్టారని, ఎవరైనా పార్టీలు పెట్టుకోవచ్చని సెటైర్లు వేశారు. కవిత పార్టీ పెట్టడం వల్ల తమకు వచ్చే నష్టం ఏమీ లేదన్నారు. ఆమె ఆత్మగౌరవం ఎలా దెబ్బతిందో వాళ్ల కుటుంబ అంశమని, ఆమె చేసిన ఆరోపణలపై ప్రభుత్వం విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. కవిత పార్టీతో తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి మార్పులు రావన్నారు.
కవితకు కాంగ్రెస్ సూటి ప్రశ్నలు
శాసనమండలిలో ఎమ్మెల్సీ కవిత చేసిన ప్రసంగంపై కాంగ్రెస్ నేతలు సూటి ప్రశ్నలు సంధిస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు కవిత ఎందుకు ఈ ప్రశ్నలు అడగలేదని నిలదీస్తున్నారు. అవినీతి జరుగుతున్నప్పుడు చూస్తూ ఉండిపోయారా? అని మండిపడుతున్నారు. తెలంగాణ బిడ్డలు ఆత్మ బలిదానాలు చేసుకున్నప్పుడు ఈ కన్నీళ్లు ఏమయ్యాయని క్వశ్చన్ చేశారు. అన్నింటిని ప్రశ్నించిన కవిత లిక్కర్ స్కాంపై సమాధానం ఎందుకు చెప్పలేదని నిలదీస్తున్నారు. ప్రస్తుతం కవిత వివాదం తెలంగాణలో కలకలం రేపుతోంది.
కవితపై బీఆర్ఎస్ ఎటాక్
బీఆర్ఎస్ పార్టీ పేరు మార్పు తనకు తెలియదంటూ ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. మరి తెలంగాణ జాగృతి పేరును భారత్ జాగృతిగా ఎందుకు మార్చారో చెప్పగలరా? అని ప్రశ్నిస్తున్నారు. BRS పార్టీ జెండాను ఆవిష్కరించినపుడు.. 'జననేతకు జయహారతి. న్యూ స్టార్ట్, న్యూ మిషన్ బై ద లీడర్ విత్ ఏ విజన్, కేసీఆర్ గారు. విజయీభవ జై భారత్ జై తెలంగాణ' అని ఎందుకు రాశారని కవితను నిలదీస్తున్నారు. ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలపై మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత తీవ్రంగా స్పందించారు. కవిత మాటలు బీఆర్ఎస్ పార్టీకి పెను ఇబ్బందిగా మారాయని, ఆమె వెనుక ఎవరో ఉన్నారన్నారు. కేసీఆర్‌ను కంటతడి పెట్టిస్తూ.. మానసిక క్షోభకు గురి చేస్తున్నారని ఫైర్ అయ్యారు. కేసీఆర్ ఆదేశాల మేరకు ఎమ్మెల్యేలందరూ అసెంబ్లీని బహిష్కరిస్తే, కవిత మాత్రం భిన్నంగా వ్యవహరించడం ఏమిటని ప్రశ్నించారు. కవిత రాజీనామా పెద్ద డ్రామా అన్నారు.