REVANTH:నేను అదే చేస్తే కేసీఆర్ జైల్లో ఉండేవారు

తమది కక్ష సాధింపు విధానం కాదన్న రేవంత్ రెడ్డి... శాసనసభలో బీఆర్ఎస్ పై ఆగ్రహం;

Update: 2025-03-28 02:00 GMT

శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను రివెంజ్ తీసుకోవాలనుకుంటే ఎంతో సమయం పట్టదని.. వాటి మీద తాను దృష్టి పెట్టుంటే ఇవాళ వాళ్లంతా జైలులో ఉండేవారని అన్నారు. తనను వేధించిన వారిని ఆ దేవుడే ఆస్పత్రి పాలు చేశారని కీలక వ్యాఖ్యలు చేశారు. తాము కక్ష సాధింపు చర్యలకు దిగడం లేదని... అభివృద్ధిపై దృష్టిసారించామని తెలిపారు. తాము అధికారంలోకి వచ్చాక ప్రజలంతా సంతోషంగా ఉన్నారని సీఎం అన్నారు. అనుమతి లేకుండా ఎవరైనా డ్రోన్‌ ఎగరవేస్తే రూ.500 జరిమానా విధిస్తారని... కానీ, డ్రోన్‌ ఎగరవేశారని ఒక ఎంపీ మీద కేసు పెట్టి చర్లపల్లి జైలులో వేశారని రేవంత్ గుర్తు చేశారు. రూ.500 జరిమానా వేసే కేసులో జైలులో పెట్టి వేధించారని వాపోయారు. నా బిడ్డ పెళ్లికి కూడా మధ్యంతర బెయిల్‌పై వచ్చి వెళ్లానని రేవంత్ అన్నారు. తాను కూడా అలా ప్రతీకార రాజకీయాలు చేయదలిస్తే.. ఇప్పటికే కొందరు జైలులో ఉండేవారని రేవంత్ తెలిపారు. కేటీఆర్‌, కేసీఆర్‌ను జైల్లో వేయాలని చాలా మంది మమ్మల్ని అడుగుతున్నాని.... కానీ, అక్రమ కేసులు పెట్టి వాళ్లను జైలుకు పంపే కక్షపూరిత రాజకీయాలు చేసే వ్యక్తిని తాను కాదని రేవంత్ అన్నారు.

రేవంత్ భావోద్వేగం

శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. తమ ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడుతుందన్న బీఆర్ఎస్ ఆరోపణలను ఖండించారు. తాను కక్షసాధింపు చర్యలకు పాల్పడే వ్యక్తిని కాదన్నారు. తనది అలాంటి స్వభావమే అయితే ఇవాళ పరిస్థితి వేరేలా ఉండేదని స్పష్టం చేశారు. తన కూతురి పెళ్లికి కూడా రానీయకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారని రేవంత్ ఎమోషనల్ అయ్యారు.

పెట్టుబడులు రాకుండా కుట్ర

రాష్ట్రంలో శాంతి భద్రతలపై ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణకు పెట్టుబడులు రాకుండా అడ్డుకునే కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్‌ను బద్నాం చేయాలని చూస్తే కుదరదని రేవంత్ తేల్చి చెప్పారు. బీఆర్ఎస్ నేతలు విజ్ఞతతో వ్యవహరించాలని సూచించారు. గత ప్రభుత్వ హయాంలోనే దిశ ఘటన, వామనరావు హత్య జరిగాయని గుర్తు చేశారు. శాంతిభద్రతల విషయంలో కొందరు అర్ధ రహిత విమర్శలు చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. గత ప్రభుత్వం శాంతిభద్రతల విషయంలో ఎంత ఉదాసీనంగా ఉందో అందరికీ తెలుసన్నారు. దిశ ఘటన, న్యాయవాద దంపతుల హత్య వంటివి గత ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఉదాహరణలని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం కుప్పకూలిపోయిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags:    

Similar News