నిస్సహాయకులకు సహాయం అందించడమే మన బాధ్యత అని అని గ్రూప్-2 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. ‘‘తల్లిదండ్రులు, పుట్టి పెరిగిన ఊరును అభివృద్ధి చేసుకోవడం మన బాధ్యత.. మీరందరూ అంకితమవుతారని పూర్తి విశ్వాసం ఉంది. ఉద్యోగార్థులు ఎవరైనా తల్లిదండ్రులను పట్టించుకోకపోతే .. మీ జీతంలో 10 నుంచి 15శాతం కోత విధించి తల్లిదండ్రుల ఖాతాలో వేస్తా. ఒకటో తేదీ మీ జీతం ఎలా వస్తుందో.. అలాగే మీ తల్లిదండ్రుల అకౌంట్లో ఒకటో తేదీన పడుతుంది. దీని కోసం త్వరలో చట్టం తీసుకొస్తాం’’ అని సీఎం అన్నారు. హైదరాబాద్ శిల్ప కళావేదికలో జరిగిన కార్యక్రమంలో గ్రూప్-2 ఉద్యోగాలకు ఎంపికైన 783 మంది అభ్యర్థులకు సీఎం, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీఎస్ రామకృష్ణారావు, మంత్రి పొన్నం ప్రభాకర్.. చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు. ‘‘శ్రీకాంతాచారి, వేణుగోపాల్‌రెడ్డి, ఈషాన్‌రెడ్డి, యాదయ్య లాంటి యువ విద్యార్థులు తమ జీవితాలను ధారపోసి.. ఆత్మబలిదానాలతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు.
పథకాలు, అభివృద్ధి పనుల అమల్లో నిర్లక్ష్యాన్ని సహించేది లేదని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటై రెండేళ్లు గడుస్తున్నా.. కొందరు అధికారుల పనితీరులో ఇంకా మార్పు రాలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. సీఎస్ రామకృష్ణారావు, సీఎంవో కార్యదర్శులతో సీఎం సమావేశమయ్యారు. కొందరు ముఖ్య కార్యదర్శులు, విభాగాధిపతుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
అధికారులు అలసత్వం వీడి అభివృద్ధి పనులపై దృష్టిసారించాలని హితవు పలికారు. సొంత నిర్ణయాలతో అధికారులు ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురావొద్దని సూచించారు. అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేస్తేనే పనులు వేగవంతమవుతాయని, ప్రజలకు మేలు జరిగే నిర్ణయాలు, కార్యక్రమాలకు ప్రాధాన్యమివ్వాలని దిశానిర్దేశం చేశారు. ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకొని, పనుల పురోగతిని సమీక్షించాలన్నారు. ‘‘కీలక దస్త్రాలు, పనులు ఎక్కడా ఆగిపోవడానికి వీల్లేదు. కేంద్రం నుంచి గ్రాంట్లు, నిధులు రాబట్టుకునే కార్యాచరణను వెంటనే చేపట్టాలి. ఇకపై సీఎస్, సీఎంవో అధికారులు ప్రతివారం నివేదికలు అందించాలి’’ అని ఆదేశించారు.