REVANTH: నేడు కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం ప్రారంభం
ఆదిలాబాద్ జిల్లాలో సీఎం పర్యటన
నేడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఉదయం బేగంపేట నుంచి హెలికాప్టర్లో ఆదిలాబాద్‌కు చేరుకుంటారు. అక్కడ చనాక కొరట పంపు హౌస్‌ను, అనంతరం నిర్మల్ జిల్లాలో సదర్ మట్ బ్యారేజీని ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు నిర్మల్ మినీ స్టేడియంలో జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. తర్వాత సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమవుతారు. ఆదిలాబాద్ జిల్లాలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభతో కాంగ్రెస్ మున్సిపల్ ఎన్నికల ప్రచారాన్ని అధికారికంగా ప్రారంభించబోతోంది. ఈ సభతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపడంతో పాటు, రాబోయే ఎన్నికలపై స్పష్టమైన సంకేతాన్ని ప్రజలకు ఇవ్వాలని కాంగ్రెస్ భావిస్తోంది. సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా ప్రచార బాధ్యతలు చేపట్టడంతో పార్టీ శ్రేణుల్లో కొత్త జోష్ కనిపిస్తోంది. మున్సిపల్ ఎన్నికలు పార్టీ గుర్తుతోనే జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ అన్ని మున్సిపాలిటీల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోంది. అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచార విధానం వరకు ప్రతి అంశంపై పార్టీ అంతర్గతంగా విస్తృత చర్చలు జరుపుతోంది. ప్రతి మున్సిపాలిటీలో కాంగ్రెస్‌ను గెలిపించే బాధ్యతను ముఖ్యనేతలకు అప్పగించనున్నారు.
పంచాయతీ ఎన్నికల్లో రెబెల్స్ కారణంగా కొన్నిచోట్ల ప్రతిపక్షాలు లాభపడ్డాయని.. మున్సిపాలిటీల్లో అది పునరావృతం కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సీనియర్ నాయకులు చెప్పారు. ప్రధానంగా స్థానిక నేతల మధ్య అభిప్రాయభేదాలు ఇతర పార్టీలకు ఉపయోగపడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని పీసీసీ గట్టి నిర్ణయం తీసుకుంది. ఏ మున్సిపాలిటీలో నేతల మధ్య సఖ్యత ఎలా ఉంది, ఎవరు ఎంతమంది అభ్యర్థులకు టిక్కెట్లు ఇవ్వాలని కోరుతున్నారనేది ముందే చెప్పాలని కోరింది. ఒక్కో వార్డుకు ఐదు నుంచి ఆరుగురు ఆశావహులను ఎంపిక చేయాలని సూచించింది.