జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీదే విజయమని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్పుకొచ్చారు. సర్వేలో ఎవరు ముందుంటే వారికే సీటు అని క్లారిటీ ఇచ్చారు. కల్వకుంట్ల కవితది ఆస్తుల పంచాయతీ.. ఆమెకు ప్రజల్లో ఏం ఇమేజ్ ఉందని ప్రశ్నించారు. ఫార్ములా ఈ రేసు కేసులో కేటీఆర్ అరెస్ట్ తప్పదు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ చేసి కేసీఆర్, కేటీఆర్ ఎన్నికల్లో గెలిచారని విమర్శించారు. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి విషయం ఏఐసీసీ పరిధిలో ఉందని సరైన సమయంలో సరైన నిర్ణయం అధిష్టానం తీసుకుంటుందన్నారు. సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తున్నామన్నారు. డీసీసీల అంశంపై సమావేశంపై రాహుల్ గాంధీతో చర్చించామన్నారు. ఈ సమావేశానికి ఏఐసీసీ కొత్తగా ఎంపిక చేసిన 22 మంది అబ్జర్వర్లు హాజరయ్యారన్నారు.
బీసీ రిజర్వేషన్ల అమలుకు చిత్తశుద్ధితో కృషి: సీఎం
తెలంగాణలో బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచి అమలు కోసం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. బిహార్‌లోని పట్నాలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో రేవంత్ పాల్గొన్నారు. సీఎంతో పాటు కమిటీ శాశ్వత ఆహ్వానితులు మంత్రి దామోదర్ రాజనర్సింహ, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షీ నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ సమావేశంలో పాల్గొన్నారు. రాహుల్ గాంధీ ఇచ్చిన ‘ఓట్ చోర్- గద్దీ ఛోడ్’ నినాదంతో చేపట్టిన కార్యక్రమాన్ని తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లో విజయవంతంగా నిర్వహించినట్లు రేవంత్‌రెడ్డి తెలిపారు. బీసీలకు 42 రిజర్వేషన్ల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యల గురించి రేవంత్ సమావేశంలో వివరించారు.
కలెక్టర్లకు సీఎం కీలక ఆదేశాలు
తెలంగాణ రాష్ట్రంలో రానున్న రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయనే వాతావరణ శాఖ అంచనాల నేపథ్యంలో అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అప్రమత్తం చేశారు. అన్ని కలెక్టర్లు హై అలెర్ట్ గా ఉండి పరిస్థితిని సమీక్షించాలని సూచించారు. అవసరమైతే ముందుగానే ప్రజలను ఖాళీ చేయించి, పునరావాస కేంద్రాలను తరలించాలని సూచించింది. అన్ని కాజ్ వేలను పరిశీలించి రోడ్లపైకి వరద నీరు నిలిచే ప్రాంతాలను గుర్తించి ముందస్తుగా ట్రాఫిక్ ను నిలిపివేయాలన్నారు. విద్యుత్ శాఖ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని అంతరాయం లేకుండా కరెంట్ సరఫరా ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. వేలాడే వైర్లను తొలగించడంతో పాటు, ఎలాంటి ప్రాణాపాయం జరగకుండా చూడాలన్నారు. దసరా సెలవులు ఉన్నప్పటికీ విద్యాసంస్థలు కూడా వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. వర్షం సమయంలో జనం రోడ్లపైకి రావొద్దని సూచించారు. హైదరాబాద్‌లో జీహెచ్ఎంసీ, హైడ్రాతో పాటు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.