CONGRESS: స్థానిక సంస్థల ఎన్నికలు.. కాంగ్రెస్‌కు రిఫరెండమా...?
స్థానిక సంస్థల ఫలితాలు కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుకు రెఫరెండంగా భావిస్తున్నారన్న చర్చ
తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల నగరా మోగింది. ఇప్పటికే నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. స్థానిక సంస్థల ఫలితాలు కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుకు రెఫరెండంగా భావిస్తున్నారన్న చర్చ సాగుతోంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక తొలిసారి స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సిద్ధమైంది. లోకల్ బాడీస్ ఎన్నికల్లోనే బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని సీఎం రేవంత్‌రెడ్డి భావించారు. రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు ఈ ఎన్నికల్లోనే దీన్ని అమలు చేస్తామని టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కూడా చెప్తూ వచ్చారు. ఈ ఎన్నికల్ని రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ప్రధానంగా అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఈ గెలుపు చాలా ముఖ్యమన్న అభిప్రాయం బలంగా ఉంది. అంతకు మించి ఈ ఎన్నికలు రెండేళ్ల కాంగ్రెస్ పాలనకు గీటు రాయిగా భావించాల్సి ఉంటుందన్న చర్చలు సైతం నడుస్తున్నాయి. ఇప్పటివరకు ప్రభుత్వం హామీల అమలు విషయంలో అవకాశం ఉన్న మేరకు సీరియస్‌గా ప్రయత్నిస్తోందన్న ఫీలింగ్ ఉంది.
ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్ని చూసుకుంటే…
ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డి గ్రౌండ్ లెవల్లో ఏం జరుగుతోందన్న ఫీడ్ బ్యాక్ తెప్పించుకునే విషయంలో సీరియస్‌గా ఉన్నారు. ప్రతిపక్షం యూరియా అంశాన్ని రేవంత్ ప్రభుత్వ వైఫల్యమే అన్నట్టు చూపించే ప్రయత్నం చేసింది. దాని ప్రభావం ప్రభుత్వం మీద ఉంటుందన్నది ప్రతిపక్షం లెక్క. అదే సమయంలో ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్ని చూసుకుంటే… స్థానిక సంస్థల ఎన్నికలు… అధికారపార్టీకి అనుకూలంగానే ఉంటున్నాయి. ఈ ఫలితాలు తేడా రాకుండా.. మంత్రులను బాధ్యులను చేయాలని పార్టీ భావిస్తోంది. తాజా రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో అన్ని పార్టీలు ఈ లోకల్ బాడీ ఎన్నికలు చాలెంజ్ గా మారాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి బిగ్ చాలెంజ్‌గా నిలవనున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో దెబ్బతిన్న ఆ పార్టీ.. లోకల్లో సత్తా చాటడం ద్వారా బౌన్స్ బ్యాక్ కావాలని చూస్తోంది. ఈ మేరకు ప్రభుత్వ వైఫల్యాలే ప్రధాన ఎజెండాగా ప్రజల్లోకి వెళ్లేందుకు పావులు కదుపుతోంది. అయితే ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను రాష్ట్ర రాజకీయాల్లో రౌండప్ చేసేందుకు ఈ ఎన్నికలే కీలకం అని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ మేరకు వ్యూహాత్మకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రణాళికలు వేస్తున్నట్లు చర్చ జరుగుతోంది. స్థానిక ఎన్నికల విషయంలో కాంగ్రెస్ పార్టీ దూకుడుగా వెళ్తుంటే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాత్రం ఇంకా ఎర్రవల్లి ఫామ్ హౌస్‌కే పరిమితం అయ్యారనే టాక్ ఉంది. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ కచ్చితంగా గెలిస్తేనే రాబోయే రోజుల్లో పార్టీకి పూర్వవైభవానికి చాన్స్ ఉంటుంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఇప్పటికైనా రాజకీయ అజ్ఞాతవాసం వీడుతారా లేక కేటీఆర్, హరీశ్ రావు పైనే ఈ ఎన్నికల భారం మోపుతారా అనేది వేచి చూడాలి. బీజేపీ నేతలు వేసే అడుగులపైనా అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది.