MEDARAM: మేడారం ప్రాంగణం.. భక్త జన సంద్రం
.సమ్మక్క-సారలమ్మ దర్శనానికి భారీ క్యూలైన్
తెలంగాణ గిరిజన సంస్కృతి, ప్రజా విశ్వాసాలు, ఆధ్యాత్మిక సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచిన మేడారం మరోసారి భక్తుల జయజయధ్వానాలతో మార్మోగుతోంది. ఇంకా మహా జాతర అధికారికంగా ప్రారంభం కాకముందే లక్షలాది మంది భక్తులు అడవిబాటలు, జాతీయ రహదారులు, గ్రామ మార్గాల ద్వారా మేడారం వైపు తరలివస్తున్నారు. సమ్మక్క–సారలమ్మలను దర్శించుకోవాలనే ఆత్రుతతో భక్తులు ముందుగానే గద్దెల వద్దకు చేరుకుంటుండటంతో మేడారం పరిసర ప్రాంతాలన్నీ జనసంద్రంగా మారాయి. ఎక్కడ చూసినా భక్తుల గుంపులు, వాహనాల రద్దీ, పోలీసుల హెచ్చరికల మధ్య ఆధ్యాత్మిక వాతావరణం ఉట్టిపడుతోంది.
ముందే మొదలైన భక్తుల ప్రవాహం
ఈ నెల 28వ తేదీ నుంచి ప్రారంభం కానున్న సమ్మక్క సారలమ్మ మేడారం మహా జాతరకు ముందు నుంచే భక్తుల రాక మొదలైంది. ముఖ్యంగా సంక్రాంతి వరుస సెలవులు రావడంతో రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో మేడారానికి చేరుకుంటున్నారు. ముందస్తుగా మొక్కులు చెల్లించుకోవాలనే నమ్మకంతో భక్తులు గద్దెలను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఈసారి రికార్డు స్థాయిలో భక్తులు వస్తారని అంచనా వేసిన తెలంగాణ ప్రభుత్వం మేడారం జాతరకు అపూర్వంగా ఏర్పాట్లు చేసింది. మొత్తం రూ.260 కోట్ల నిధులను కేటాయించగా, అందులో రూ.150 కోట్లు తాత్కాలిక ఏర్పాట్ల కోసం, రూ.110 కోట్లు శాశ్వత మౌలిక వసతుల నిర్మాణాల కోసం వినియోగిస్తున్నారు. గద్దెల ప్రాంగణంలో భక్తుల రద్దీని తట్టుకునేలా క్యూలైన్లను వెడల్పు చేయడంతో పాటు, జంపన్న వాగు వద్ద స్నాన ఘట్టాలను ఆధునీకరించారు.
గుడిమెలిగే పండుగతో జాతర సందడి
మేడారం మహా జాతరలో తొలి ఘట్టమైన ‘గుడిమెలిగే’ పండుగ బుధవారం లాంఛనంగా ప్రారంభమైంది. ప్రధాన పూజారులు కుటుంబ సమేతంగా డోలు వాయిద్యాలతో అమ్మవారి పూజా మందిరాలకు తరలివచ్చారు. సిద్దబోయిన మునీందర్ నివాసంలో సమావేశమైన పూజారులు అక్కడి నుంచి సమ్మక్క దేవత పూజా మందిరానికి చేరుకుని శుద్ధి కార్యక్రమాలు నిర్వహించారు. ఆడపడుచులు అమ్మవారి శక్తిపీఠం పరిసరాలను ఎర్రమట్టితో అలికి ముగ్గులు వేశారు. వడ్డెలు అడవికి వెళ్లి గుట్టగడ్డిని తీసుకువచ్చి పూజా మందిరంపై పరిచారు. అనంతరం పూజారులు సిద్దబోయిన జగ్గారావు, మునీందర్, మహేశ్, నితిన్, చందా గోపాల్‌రావు, కొక్కెర కృష్ణయ్య తదితరులు అమ్మవారికి నైవేద్యాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. గద్దెల వద్దకు వెళ్లి సమ్మక్క, సారలమ్మలకు మొక్కులు చెల్లించారు.
మేడారంలో క్యాబినెట్ భేటీపై చర్చ
మహా జాతర నేపథ్యంలో ఈ నెల 18న మేడారంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్వహించే అవకాశముందని సమాచారం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశం చరిత్రలో అరుదైనదిగా భావిస్తున్నారు. రాజధాని వెలుపల క్యాబినెట్ సమావేశం జరగడం ఇదే తొలిసారి కావొచ్చని అధికారులు చెబుతున్నారు. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.