TG: రైతులను కోలుకోలేని దెబ్బతీసిన అకాల వర్షాలు
తడిసి ముద్దయిన ధాన్యం.... ధాన్యం కొనుగోళ్లు నిలిచిపోవడంతో రైతుల తీవ్ర ఇబ్బంది
తెలంగాణలో ఆకాల వర్షాలు రైతులను కోలుకోలేదని దెబ్బతీస్తున్నాయి. జోరువానకి పలుచోట్ల కల్లాలు, మార్కెట్ల వద్దకి తీసుకొచ్చిన ధాన్యం తడిసి ముద్ద అయ్యింది. కొద్దిరోజులుగా ధాన్యం కొనుగోళ్లు నిలిచిపోవడం వల్ల తీవ్ర ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్త చేశారు. తడిచిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలంటూ పలుచోట్ల కర్షకులు ఆందోళనకు దిగారు.
వర్షానికి తడిచిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలంటూ పలుచోట్ల రైతులు ఆందోళనకు దిగారు. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం కొమలంచ గ్రామంలో తడిచిన ధాన్యాన్ని రాష్ట్రప్రభుత్వం కొనుగోలు చేయాలని కర్షకులు రోడెక్కారు. ఐదు రోజులుగా ధాన్యం కొనుగోళ్లు నిలిచిపోయాయని నిరసనకు దిగారు. 40 లారీలకు పైగా ధాన్యం ఇంకా కల్లాల్లోనే ఉందన్న రైతులు.. వడ్లని F.C.I కేంద్రాలకు తరలించి 25 రోజులు గడిచిన ఇంకా తూకం జరగడం లేదంటూ రోదిస్తున్నారు. అధికారులు సమస్యను పరిష్కరించే వరకు కదిలేది లేదంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
నిర్మల్ జిల్లా మామడ, లక్ష్మణ చందా మండలాల్లో నిన్న రాత్రి కురిసిన అకాల వర్షానికి కల్లాల్లో ధాన్యం తడిసిముద్దైంది. చేతికొచ్చిన పంట వర్షానికి తడిసి ముద్ద కావడంతో మొలకలొచ్చె అవకాశం ఉందని... రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. తడిచిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేసి ఆదుకోవాలని అన్నదాతులు విజ్ఞప్తి చేస్తున్నారు.
ధాన్యంకొనుగోలు చేయాలంటూ యాదాద్రి భువనగిరి జిల్లా గూడూరు వద్ద....... జాతీయ రహదారిపై రైతులు రాస్తారోకో నిర్వహించారు. ధాన్యం కొనుగోళ్లు నత్త నడకన సాగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను తాలు, తేమ పేరుతో అధికారులు వేధిస్తున్నారని.... 20 రోజులుగా ధాన్యం కొనుగోలు చేయట్లేదని ఆరోపించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ... 163వ జాతీయ రహదారిపై బైఠాయించగా కొద్దిసేపు హైదరాబాద్ - వరంగల్ వెళ్లే వాహనాలరాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఆందోళన విరమింపజేయడానికి వచ్చిన పోలీసులతోనూ రైతులు వాగ్వాదానికి దిగారు.