HYD: నేడే మహా నిమజ్జనం
హైదరాబాద్ పరిధిలో లక్ష విగ్రహాలు నిమజ్జనం.. భారీ ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం;
హైదరాబాద్‌లో మహా నిమజ్జనానికి సర్వం సిద్ధమైంది. నవ రాత్రులు ఘనంగా పూజలు అందుకున్న గణనాథుడు.. గంగమ్మ ఒడికి చేరుతున్నాడు. కొన్ని రోజులుగా నిమజ్జనాలు ప్రారంభం కాగా.. నేడు భారీగా గణపతి విగ్రహాలు నిమజ్జనానికి తరలివెళ్లనున్నాయి. దాదాపు లక్ష విగ్రహాలు నిమజ్జనం అయ్యే అవకాశాలు ఉన్నాయని అధికారులు గుర్తించారు. ఈ క్రమంలోనే జీహెచ్‌ఎంసీ పరిధిలో వినాయక నిమజ్జనాలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నేపథ్యంలోనే నగరవ్యాప్తంగా వేల మంది పోలీసులతో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. ఒక్క హుస్సేన్ సాగర్ చుట్టే 3వేల మంది పోలీసులు గస్తీ కాయనున్నట్లు తెలిపారు. మహిళల భద్రత కోసం హుస్సేన్ సాగర్ పరిసరాల్లో షీటీమ్స్‌ను మోహరించినట్లు తెలిపారు. ఇక మంగళవారం నగరంలో భారీగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
హుస్సేన్ సాగర్‌లో 30 వేల విగ్రహాల నిమజ్జనం
జీహెచ్‌ఎంసీ పరిధిలో గణనాథుడి నిమజ్జనాల కోసం 2 నెలలుగా పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులు అనేక కసరత్తులు చేపట్టారు. ఇక ఈ ఏడాది ఒక్క హుస్సేన్ సాగర్‌లోనే 25 వేల నుంచి 30 వేల విగ్రహాలను నిమజ్జనం చేస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ఆరంభమైన ఖైరతాబాద్ గణేశుడి శోభాయాత్ర.. మధ్యాహ్నం 1.30 గంటల లోపు నిమజ్జనం చేయనున్నట్లు అధికారులు తెలిపారు. సాయంత్రం 4 గంటలకు బాలాపుర్ గణేషుడు.. హుస్సేన్ సాగర్ వద్దకు చేరుకునే అవకాశం ఉంది. హైదరాబాద్ నగరంలో మొత్తం 25 వేల మంది పోలీసులు పహారా కాస్తున్నట్లు సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. ఇందులో 3వేలమందిని హుస్సే్న్ సాగర్ పరిసరాల్లో మోహరించినట్లు పేర్కొన్నారు. మరోవైపు.. మహిళల భద్రతకు 12 షీటీమ్స్ బృందాలను రంగంలోకి దించారు. ఇక మంగళవారం ఉదయం 6 గంటల నుంచి బుధవారం రాత్రి 11 గంటల వరకు భారీ వాహనాలను, ప్రైవేటు ట్రావెల్స్ బస్సులను హైదరాబాద్ నగరంలోకి అనుమతించేది లేదని అధికారులు వెల్లడించారు.
భారీ భద్రత
ఖైరతాబాద్ వినాయకుడు వెళ్లే మార్గంలో 56 సీసీటీవీ కెమెరాలతోటు.. ట్రాఫిక్ సీసీటీవీ కెమెరాలతో భద్రతను పర్యవేక్షించనున్నారు. ఇక బాలాపూర్ వినాయకుడి వద్ద 220 మంది పోలీసులను మోహరించారు. 30 సీసీటీవీ కెమెరాలతో రాచకొండ పోలీసులు నిఘా ఏర్పాటు చేశారు. బాలాపూర్ గణేష్ శోభాయాత్ర 16 కిలోమీటర్లు ప్రయాణించి ఎన్టీఆర్ మార్గ్‌కు చేరుకోనుంది. హైదరాబాద్ మహానగర పరిధిలో గణేష్ నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి తెలిపారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 465 క్రేన్లు, హుస్సేన్‌సాగర్ వద్ద 38 క్రేన్లు ఏర్పాటు చేశామని చెప్పారు. ఇక నిమజ్జనం సందర్భంగా.. విగ్రహాల శోభాయాత్రలో కలర్ పేపర్లు, పూలు, చెత్త రోడ్లపై వేయవద్దని ఆమ్రపాలి విజ్ఞప్తి చేశారు. రోడ్లపై కలర్ పేపర్లు, చెత్త వేయడం వల్ల జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య సిబ్బందికి తీవ్ర ఇబ్బందులు ఏర్పడతాయని.. అందరూ సహకరించాలని ఆమ్రపాలి కోరారు.