HYD: మూడు జిల్లాలుగా హైదరాబాద్ విభజన..!

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం... మూడు జిల్లాలుగా హైదరాబాద్... కసరత్తు చేస్తోన్న ప్రభుత్వం

Update: 2026-01-10 04:00 GMT

తెలంగాణలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ అంశం మరోసారి రాజకీయ, పరిపాలనా వర్గాల్లో చర్చకు వచ్చింది. రాష్ట్రంలో వేగంగా విస్తరిస్తున్న పట్టణీకరణ, పెరుగుతున్న జనాభా, పరిపాలనపై పెరుగుతున్న భారం నేపథ్యంలో ‘మెగా హైదరాబాద్’ నిర్మాణాన్ని కొత్తగా ఆలోచించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. పరిపాలనను ప్రజలకు మరింత చేరువ చేయడం, సేవల నాణ్యతను పెంచడం లక్ష్యంగా హైదరాబాద్ పరిధిలో కీలక మార్పులు తీసుకురావాలన్న ప్రతిపాదనపై కసరత్తు జరుగుతోంది. ఈ నేపథ్యంలో మెగా హైదరాబాద్‌ను మూడు సమాన స్థాయి జిల్లాలుగా విభజించాలన్న యోచన మళ్లీ తెరపైకి వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల సంఖ్యను పెంచిన తర్వాత కూడా, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో పరిపాలనా అసమానతలు కొనసాగుతున్నాయని అధికారులు గుర్తించారు. ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లాల భౌగోళిక విస్తీర్ణం, జనసాంద్రతలో భారీ తేడాలు ఉన్నాయి. చిన్న విస్తీర్ణంతో హైదరాబాద్ జిల్లా ఉండగా, మిగతా రెండు జిల్లాలు విస్తృత ప్రాంతాలను కవర్ చేస్తున్నాయి. దీనివల్ల పరిపాలన, పోలీస్‌, మున్సిపల్‌ సేవల అమలులో ఇబ్బందులు తలెత్తుతున్నాయని అధికారుల అభిప్రాయం.

మూడు జిల్లాలుగా విభజన

ఈ నేపథ్యంలో జిల్లాల పునర్విభజనపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా ఆలోచిస్తోంది. ఈ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజాగా ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మెగా హైదరాబాద్‌ను మూడు జిల్లాలుగా విభజించే ప్రతిపాదనపై విస్తృతంగా చర్చ జరిగినట్లు సమాచారం. ప్రజలకు మరింత సమర్థవంతమైన పాలన అందించడమే ప్రభుత్వ లక్ష్యమని అధికారులు స్పష్టం చేశారు. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న శివారు మున్సిపాలిటీలను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో విలీనం చేయడంతో నగరం విస్తృత రూపం దాల్చింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి గణనీయంగా పెరిగి, ‘మెగా హైదరాబాద్’ అనే భావన బలపడింది. ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న ప్రాంతాలన్నీ దాదాపుగా నగర భాగంగా మారాయి. ఈ విస్తరణతో ట్రాఫిక్‌ నిర్వహణ, శాంతి భద్రతలు, మున్సిపల్‌ సేవల నిర్వహణ మరింత క్లిష్టంగా మారిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ సమస్యలకు పరిష్కారంగా మెగా హైదరాబాద్‌ను మూడు సమాన స్థాయి జిల్లాలుగా విభజించాలన్న ప్రతిపాదన ముందుకు వచ్చింది. ఇలా చేస్తే జిల్లా యంత్రాంగం ప్రజలకు దగ్గరగా ఉండడంతో పాటు, అధికారులపై ఉన్న పని భారాన్ని కూడా తగ్గించవచ్చని భావిస్తున్నారు. మూడు జిల్లాలుగా విభజన జరిగితే ట్రాఫిక్ నియంత్రణ, పోలీస్‌ పర్యవేక్షణ, మౌలిక వసతుల అభివృద్ధి మరింత సమర్థంగా చేపట్టే అవకాశం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

సాంకేతిక సమస్యలు

అయితే, ఈ ప్రతిపాదనకు కొన్ని సాంకేతిక సమస్యలు కూడా ఉన్నాయని అధికారులు ప్రభుత్వానికి వివరించినట్లు సమాచారం. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టబోయే జనగణన నేపథ్యంలో జిల్లా, మండల, గ్రామాల సరిహద్దులను ఇప్పటికే డిసెంబర్ 31 నాటికి ఖరారు చేశారు. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు జిల్లాల సరిహద్దుల్లో మార్పులు చేయడం, కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడం వల్ల జనగణన ప్రక్రియలో గందరగోళం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. జనగణన డేటా, పరిపాలనా గణాంకాలపై దీని ప్రభావం పడవచ్చని ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సమగ్ర అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలని ఆదేశించినట్లు సమాచారం. భౌగోళిక దూరాలు, జనసాంద్రత, ప్రజల అవసరాలు, భవిష్యత్ పట్టణాభివృద్ధి వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని నివేదిక రూపొందించాలని సూచించారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా, పరిపాలన మరింత సమర్థంగా సాగేందుకు ఏ మార్గం అనుకూలమో స్పష్టమైన విశ్లేషణతో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని అధికారులను కోరినట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News