HYD: పాతబస్తీలో అర్ధరాత్రి రాళ్లదాడి

ఆందోళనకారులపై పోలీసుల లాఠీఛార్జ్

Update: 2026-01-15 02:30 GMT

హైదరాబాద్ పాతబస్తీలో అర్ధరాత్రి ఉద్రిక్తత నెలకొంది. బుధవారం అర్ధరాత్రి పాతబస్తీలోని పురానాపూల్ ప్రాంతంలో చోటుచేసుకున్న ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. స్వల్పంగా ప్రారంభమైన మాటల తగాదా క్రమంగా రెండు వర్గాల మధ్య ఘర్షణగా మారి, రాళ్లదాడులు, లాఠీఛార్జ్ వరకు వెళ్లడం గమనార్హం. ఈ ఘటన హైదరాబాద్ పాతబస్తీ పరిధిలోని పురానాపూల్ ప్రాంతంలో జరిగింది. 11:30 గంటల ప్రాంతంలో రెండు వర్గాల మధ్య స్వల్ప వివాదం మొదలైనట్లు సమాచారం. మొదట మాటల పరస్పర వాగ్వాదంతో ప్రారంభమైన ఈ వివాదం, క్రమంగా ఉద్రిక్తతకు దారి తీసి, ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు దాడులకు దిగే స్థాయికి చేరింది. దీంతో అక్కడ పరిస్థితి అదుపు తప్పింది. ఈ గొడవతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. అర్ధరాత్రి వేళ ఒక్కసారిగా గందరగోళం నెలకొనడంతో, చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు ఇళ్లలోంచి బయటకు రాకుండా తలుపులు మూసుకున్నారు. ఇదిలా ఉండగా, సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. అయితే, ఆందోళనకారులు వెనక్కి తగ్గకపోవడంతో పోలీసులకు కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది.

పరిస్థితి మరింత ముదిరిపోకుండా ఉండేందుకు పోలీసులు లాఠీఛార్జ్‌కు చేశారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తోపులాటలు జరిగాయి. రాళ్లదాడులు చోటుచేసుకోవడంతో కొంతసేపు ప్రాంతం యుద్ధరంగాన్ని తలపించింది. ఈ ఘర్షణల్లో పలువురు పోలీసులకు కూడా గాయాలైనట్లు సమాచారం. గాయపడిన పోలీసులకు ప్రాథమిక చికిత్స అందించినట్లు అధికారులు తెలిపారు. ఘటన తీవ్రతను గమనించిన ఉన్నతాధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. పురానాపూల్ పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. అదనపు బలగాలతో పాటు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. భద్రతా కారణాల దృష్ట్యా బహదూర్ పుర నుంచి పురానాపూల్ వెళ్లే ప్రధాన రహదారిని పోలీసులు పూర్తిగా బ్లాక్ చేశారు. ఈ మార్గంలో ప్రయాణించే వాహనాలను ఇతర దారుల్లోకి మళ్లించారు

Tags:    

Similar News