KAVITHA: శాసనమండలిలో కవిత కంటతడి
తన్నుకొస్తున్న కన్నీటిని బిగపట్టి మరీ కవిత ప్రసంగం
శాసనమండలిలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బోరుమన్నారు. తన్నుకొస్తున్న కన్నీటిని బిగపట్టి మరీ కవిత ప్రసంగించారు. మండలిలో చివరి ప్రసంగం చేసిన కల్వకుంట్ల కవిత ఉద్యమ ప్రస్థానంలో తన ప్రయాణాన్ని తలచుకుని భావోద్వేగానికి గురయ్యారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందే తెలంగాణ జాగృతిని స్థాపించానని గుర్తు చేశారు. బీఆర్ఎస్ తనపై కక్ష కట్టిందని చెప్తూ కవిత ఏడ్చేశారు. బీఆర్ఎస్ పార్టీపై శాసనమండలిలో కవిత తీవ్ర విమర్శలు చేశారు. ఆడబిడ్డను అని చూడకుండా తనపై కక్ష సాధింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. భారత రాజ్యాంగాన్ని మార్చాలని వ్యాఖ్యానించిన కేసీఆర్.. ముందు తన పార్టీ రాజ్యాంగాన్ని మార్చుకోవాలని సూచించారు. తన వాదన వినకుండా ఏకపక్షంగా పార్టీ నుంచి బహిష్కరించారని కవిత ఆరోపించారు. ప్రసంగం సాగుతున్నంత సేపూ కవిత కంటతడి పెట్టారు.
నాది ఆస్తుల పంచాయితీ కాదు, ఆత్మగౌరవ పంచాయితీ అని కవిత అన్నారు. "దేవుడు మీద.. నా ఇద్దరి బిడ్డలపై ప్రమాణం చేస్తున్నా.. ఒక్య వ్యక్తిగా సభ నుంచి వెళ్లిపోతున్నా.. ఒక శక్తిగా తిరిగివస్తా. కేసీఆర్‌పై కక్షతో BJP నన్ను జైల్లో పెట్టింది. ఈడీ, సీబీఐలపై పోరాడినా BRS నాకు అండగా నిలవలేదు. KCRకు అవినీతి మరక అంటితే నేనే పోరాడా.. నా సస్పెన్షన్‌కు ముందు నా వివరణ కోరలేదు. BRS నుంచి దూరమైనందుకు సంతోషిస్తున్నా." అన్నారు.