KAVITHA: రేవంత్ రెడ్డి ఇంటి ముందు ధర్నా చేస్తా
నల్లగొండ జిల్లాలో కవిత జన జాగృతి యాత్ర
కిష్టరాంపల్లి, నక్కలగండి ప్రాజెక్ట్ ల భూ నిర్వాసితుల గోడు పట్టించుకోకపోతే సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ముందు ధర్నా చేస్తామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. సుంకిశాల ప్రాజెక్టు రిటైనింగ్ వాల్ కూలితే నల్గొండ జిల్లాకు చెందిన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ మంత్రిగా ఉన్నా, మరో సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంత్రిగా ఉన్నా పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా నల్గొండ జిల్లాలో మాట్లాడిన కవిత.. గతంలో కేసీఆర్ను లక్ష తిట్లు తిట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ఇప్పుడు సమస్యలపై ఎందుకు పట్టించుకోవడం లేదని నిలదీశారు. నల్లగొండ అంటేనే పోరాటాల పురిటిగడ్డ అని సాయుధ రైతాంగ పోరాటంలో.. ఉద్యమంలోనూ ఈ జిల్లా కీలక పాత్ర పోషించిందన్నారు.
జాగృతికి బీఆర్ఎస్ శత్రువే
అధికారంలో బీఆర్‌ఎస్ ఉన్నా, కాంగ్రెస్ ఉన్నా ప్రజాసమస్యలు అలాగే ఉన్నాయని విమర్శించారు. ప్రజాసమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై నిరంతరం ఒత్తిడి తెచ్చే బాధ్యతను జాగృతి తీసుకుందని చెప్పారు. తప్పు ఎవరు చేసినా తప్పేనని, బీఆర్‌ఎస్ తప్పులు చేయడం వల్లే ప్రజలు ఆ పార్టీని అధికారం నుంచి తప్పించారని అన్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పని చేయకపోతే ప్రజలు వేరే వారికి అధికారమిస్తారని హెచ్చరించారు. పదేళ్ల బీఆర్‌ఎస్, రెండేళ్ల కాంగ్రెస్ పాలన కలిపి మొత్తం పన్నెండేళ్లలో కృష్ణా జలాలు తెలంగాణకు ఎందుకు తేలేకపోయారో మేధావులు ఆలోచించాలని కోరారు. జాగృతికి బీఆర్ఎస్ దుష్మనే అని స్పష్టం చేశారు.