KTR: రేవంత్.. రంథ్రాన్వేషణ రాష్ట్రానికి నష్టం: కేటీఆర్
ముఖ్యమంత్రి తిట్లే తనకు దీవెనలన్న కేటీఆర్
బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి షేక్‌హ్యాండ్ ఇవ్వటంపై కేటీఆర్ స్పందించారు. 'కేసీఆర్ అంటే తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరికీ గౌరవం. కేసీఆర్‌ని సభలో కలిసేంత సంస్కారం రేవంత్ రెడ్డికి ఉంటే చాలు. ఇదే సంస్కారం బయట మాటల్లో ఉంటే బాగుంటుంది. రాజకీయ ప్రత్యర్థులు ఒకరినొకరు పలకరించుకునేంత సానుకుల వాతావరణం ఉంటే మంచిదే' అన్నారు. తెలంగాణ శాసనసభ ప్రాంగణంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర రాజకీయాలు, నీటిపారుదల ప్రాజెక్టులు, శాసనసభ చర్చలు, జీహెచ్‌ఎంసీ విభజన, టెలిఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు, అలాగే సీఎం రేవంత్‌రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. పలు అంశాలపై కేటీఆర్ తీవ్ర స్థాయిలో స్పందిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
పార్టీని వదిలి వెళ్లిన నేతలను మళ్లీ తీసుకోవాల్సిన అవసరం లేదన్నది తన అభిప్రాయమని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ‘‘బీఆర్ఎస్ను కాదని భాజపాలోకి వెళ్లిన నేతల నియోజకవర్గాల్లో ఎన్ని సర్పంచ్ స్థానాలు గెలిచారో చూశాం కదా! నేతల బలం లేకున్నా మా కార్యకర్తలు సర్పంచ్‌లను గెలిపించుకున్నారు. 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరారని న్యాయస్థానంలో పోరాడుతున్నాం.. వారితో మాకేం సంబంధం?వారి విషయంలో సీఎం మాటలు విడ్డూరంగా ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల నాటికి, సర్పంచ్ ఎన్నికల నాటికి పరిస్థితులు మారాయి. కడియం నా గురించి ఏం మాట్లాడతారు? వాస్తవాలు దాచలేరు కదా! పోచారం ఈ వయసులో ఏం సాధించారు? ’’ అని కేటీఆర్ అన్నారు.
"నెల జీతం కోసం అసెంబ్లీకి కేసీఆర్"
కేసీఆర్ సుదీర్ఘ విరామం తర్వాత అసెంబ్లీకి హాజరైన విషయం తెలిసిందే. అయితే అందరూ ఉహించినట్లుగాను మాజీ సీఎం కేసీఆర్ సభలో కొన్ని క్షణాల పాటు మాత్రమే ఉండి వెళ్లిపోయాడు. దీంతో కేసీఆర్ ఇలా వచ్చి అలా వెళ్లడంపై ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. కేసీఆర్ సభకు వచ్చింది ప్రజా సమస్యల కోసం కాదని, తన నెల జీతం తీసుకోవడానికి, ఎమ్మెల్యే సభ్యత్వాన్ని కాపాడుకోవడానికి మాత్రమేనని ఎద్దేవా చేశారు.