ప్రముఖ కవి, రచయిత నందిని సిధారెడ్డిని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వరించింది. ఆయన రాసిన అనిమేష కవితా సంపుటికి ఈ పురస్కారం లభించింది. కరోనా కాలంలోని సామాజిక పరిస్థితులే ఇతివృత్తంగా దీన్ని రచించారు. నందిని సిధారెడ్డి తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి ఛైర్మన్‌గానూ పని చేశారు. తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి చైర్మన్ నందిని సిధారెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు దక్కడం యావత్ తెలంగాణ రాష్ట్రానికే గర్వకారణమని ఆయన కొనియాడారు. ఈ సందర్భంగా సిధారెడ్డికి తన తరపున మరియు పార్టీ తరపున అభినందనలు తెలియజేశారు. ఆధునిక తెలుగు కవిత్వంలో నందిని సిధారెడ్డి ఎన్నో పరిశోధనలు చేసి, తన అమూల్యమైన రచనలతో తెలుగు సాహితీ రంగానికి విశిష్ఠ సేవలు అందించారని కేటీఆర్ పేర్కొన్నారు. మంజీరా రచయితల సంఘం స్థాపించి తెలుగు సాహిత్యానికే వన్నె తెచ్చిన ఆయన కృషి మరువలేనిదన్నారు. తెలంగాణ స్వరాష్ట్ర ఆకాంక్షను, ఆవశ్యకతను తన శక్తివంతమైన పాటలతో చాటుతూ.. తెలంగాణ ఉద్యమానికి ఒక గొప్ప ఊపునిచ్చిన ప్రజా కవిగా అభివర్ణించారు.
తెలంగాణ గర్వించదగ్గ కవి: కేసీఆర్
నందిని సిధారెడ్డికు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చిన నేపథ్యంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నందిని సిధారెడ్డిని అభినందిస్తూ కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. నందిని సిధారెడ్డి దీర్ఘ కవితా సంపుటి ‘అనిమేష’, కరోనా సమయంలో ప్రపంచం ఎదుర్కొన్న సంక్షోభాన్ని, ముఖ్యంగా మానవ సంబంధాల విచ్ఛిన్నతలను హృద్యంగా చిత్రీకరించడం ద్వారా ఈ అవార్డు పొందడం గొప్ప విషయయని తెలిపారు. ఈ సందర్భంగా నందిని సిధారెడ్డిపై ప్రశంసల వర్షం కురిపించారు. తెలంగాణ మట్టివాసన తెలిసిన కవి నందిని సిధారెడ్డి అని పేర్కొన్నారు. తన సాహిత్యం తెలంగాణ జీవితాన్ని అక్షరబద్ధం చేసిందని, తెలంగాణ ప్రజలకు గర్వకారణంగా నిలిచిందని చెప్పుకొచ్చారు. నందిని సిధారెడ్డి తెలంగాణ గర్వించదగ్గ కవి మాత్రమే కాక, మానవ సంబంధాలు, సామాజిక సమస్యలు, ప్రజల జీవిత అనుభవాలను సృజనాత్మకంగా చిత్రించే ప్రతిభావంతమైన రచయిత అని కేసీఆర్ అభిప్రాయపడ్డారు.