తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటు చేసే ప్రతిపాదన లేదని కేంద్రం స్పష్టం

లంగాణలో పసుపు బోర్డు ఏర్పాటు చేసే ప్రతిపాదన లేదని మరోసారి లోక్‌సభ వేదికగా కేంద్రం స్పష్టం చేసింది.;

Update: 2021-03-16 14:58 GMT

పసుపు బోర్డు ఏర్పాటు కోసం ఏళ్లుగా నిరీక్షిస్తున్న నిజామాబాద్ రైతన్నల ఆశలపై కేంద్రం నీళ్లు చల్లింది. తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటు చేసే ప్రతిపాదన లేదని మరోసారి లోక్‌సభ వేదికగా కేంద్రం స్పష్టం చేసింది. పసుపు బోర్డు ఏర్పాటు ప్రతిపాదన ఎందుకు లేదో చెప్పాలని లోక్‌సభలో కేంద్రాన్ని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్‌ కుమార్ రెడ్డి నిలదీశారు. నిజామాబాద్‌లో పసుపు ఎగుమతికి అవకాశం ఉందని.. మద్దతు ధర, మార్కెట్ నిధులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్య హయాంలో నిజామాబాద్‌లో పసుపు బోర్డ్ కోసం భూసేకరణ కూడా జరిగిందని ఉత్తమ్ గుర్తుచేశారు.

అయితే తెలంగాణలో పసుపు బోర్డు పెట్టేది లేదని.. ఇది వరకే ఏర్పాటు చేసిన సుగంధ ద్రవ్యాల బోర్డు రీజనల్ కార్యాలయంతోనే పనులు సరిపెట్టుకోవాలని కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి పురుషోత్తం రూపాలా సమాధానమిచ్చారు. కేంద్రమంత్రి సమాధానంతో సంతృప్తి చెందని ఉత్తమ్.. పసుపుబోర్డు ఎందుకు ఏర్పాటు చేయలేకపోతున్నారో చెప్పాలని పట్టుపట్టారు. దాంతో సభలో కొద్దిసేపు గందరగోళం నెలకొంది. రాజకీయ కోణంలో అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పనంటూ మంత్రి పురుషోత్తం కూర్చున్నారు. దీంతో మంత్రి సమాధానం చెప్పాల్సిందేనని సభ్యులు డిమాండ్ చేశారు.

మరోవైపు పసుపు బోర్డ్‌ కంటే మెరుగైన స్పైసెస్‌ ఎక్స్‌టెన్సన్‌ కేంద్రాన్ని పెట్టినట్టు కేంద్రం స్పష్టం చేసిందని నిజామాబాద్‌ ఎంపి ధర్మపురి అర్వింద్‌ అన్నారు. పసుపు రైతులకు అన్నిరకాలుగా లాభం చేకూర్చేలా కేంద్రం చర్యలు తీసుకుంటుందని తెలిపారు

అటు ఎంపీ అర్వింద్ వ్యాఖ్యలపై టీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. ఎన్నికల సమయంలో పసుపు బోర్డు తీసుకురాకపోతే రాజీనామా చేస్తానని చెప్పిన ఎంపీ అర్వింద్‌... ఇప్పుడు ఆ పని చేసి ఉద్యమానికి సిద్ధం కావాలన్నారు. కేంద్ర వ్యవసాయ మంత్రి దగ్గరికి వెళ్లి పసుపు బోర్డుపై మాట్లాడాలన్నారు. బీజేపీ అంటే అబద్ధాల పార్టీ అని.. అమ్మకం పార్టీగా మారిందని జీవన్‌రెడ్డి విమర్శించారు.

మరోవైపు నిజామాబాద్‌లో పసుపు బోర్డు వస్తుందని ఏళ్లుగా ఎదురుచూస్తున్న రైతన్నలు కేంద్రం ప్రకటనతో ఆగ్రహంలో ఉన్నారు. నిజామాబాద్‌ రూరల్‌, ఆర్మూర్‌, బాల్కొండ, జగిత్యాల, కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సుమారు 80 వేల ఎకరాల్లో పసుపు పంటను సాగుచేస్తున్నారు. తమకు గిట్టుబాటు ధర లభించేలా నిజామాబాద్‌ కేంద్రంగా బోర్డు ఏర్పాటుచేయాలని ఇక్కడి రైతులు సుమారు మూడున్నర దశాబ్దాలుగా పోరాడుతున్నారు. అయితే అందుకు నిరాకరించిన నేపథ్యంలో.. ఎంపీ అర్వింద్‌ పోరాటం చేయాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. స్పైసెస్‌ ఎక్స్‌టెన్సన్‌ కేంద్రంతో సరిపుచ్చుకోకుండా పసుపు బోర్డు సాధించాల్సిందేనని ఆందోళనకు సిద్ధమవుతున్నారు.

Tags:    

Similar News