NTR: జూబ్లీహిల్స్‌లో మార్మోగుతున్న ఎన్టీఆర్ పేరు
ఉప ఎన్నికల వేళ అన్నగారు ట్రెండింగ్.. ఎన్టీఆర్ పేరు ప్రస్తావిస్తున్న కాంగ్రెస్-బీఆర్ఎస్.. జూబ్లీహిల్స్‌లో ఎక్కువగా కమ్మ సామాజికవర్గం.. వారిని ఆకట్టుకునేందుకు పార్టీల ప్రయత్నాలు
జూబ్లీహిల్స్ చౌరస్తాలో అన్నగారి పేరు మార్మోగుతోంది. అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ అన్నగారి పేరు పదేపదే ప్రస్తావిస్తున్నాయి. అసలు జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో ఎన్టీఆర్ పేరును వల్లె వేస్తున్నారు. సీనియర్ ఎన్టీఆర్ కాలం చేసి సుమారు 30 ఏళ్లు అవుతున్నా… ఆయన పేరు రాజకీయాలను ఇంకా శాసిస్తూనే ఉంది. ఏదో రకంగా తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో అన్నగారి పేరు వినిపిస్తూనే ఉంటుంది. ఇపుడు విషయం ఏమిటంటే జూబ్లీహిల్స్ ఉపఎన్నికలోనూ అన్నగారి పేరు బాగా వినబడుతోంది. జూబ్లీహిల్స్‌లోని అనేక సామాజికవర్గాల్లో కమ్మవారు కూడా గణనీయమైన సంఖ్యలోనే ఉన్నారు. ఆ ఓటు బ్యాంక్‌ను ఆకర్షించడానికి ఇటు కాంగ్రెస్ అటు బీఆర్ఎస్ పోటాపోటీగా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇస్తున్నాయి. దీంతో ఎన్నికల ప్రచారంలో ఎన్టీఆర్ పేరు మార్పోగుతోంది. మొన్నీ మధ్య జూబ్లీహిల్స్ కమ్మ సంఘం నేతలు సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. వారి సమస్యలు విన్న సీఎం సానుకూలంగా స్పందించారు. సమస్యల పరిష్కారంతో పాటుగానే అమీర్‌పేట్‌లో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. ఇటీవల ఎన్నికల ప్రచారంలోనూ అమీర్‌పేటలో ఎన్టీఆర్ విగ్రహాన్ని పెట్టే బాధ్యత తనదేన్నారు రేవంత్‌రెడ్డి.
కేటీఆర్ కూడా..
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఎన్టీఆర్ అభిమానుల ఓట్లను తమ పార్టీకే దక్కుతాయని గట్టిగా వాదిస్తున్నారు. తన పేరునే ప్రధాన అస్త్రంగా చేసుకుని ఆయన కాంగ్రెస్ వాదనను తిప్పికొడుతున్నారు. తన పేరులో తారక రామారావు ఉండడం అనేది ఎన్టీఆర్‌పై తమ కుటుంబానికి, పార్టీకి ఉన్న అభిమానాన్ని తెలియజేస్తుందని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ భావోద్వేగ బంధం కారణంగానే ఎన్టీఆర్ అభిమానులంతా బీఆర్ఎస్కు మద్దతు ఇస్తారని చెబుతున్నారు. జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తన చివరి శ్వాస వరకు ఎన్టీఆర్ అభిమానిగా ఉన్నారని, ఆయన్ని మించిన ఎన్టీఆర్ అభిమాని ఎవరుంటారని కేటీఆర్ ప్రశ్నించారు. గోపీనాథ్ సతీమణి, బీఆర్ఎస్ అభ్యర్థి అయిన మాగంటి సునీతకు ఎన్టీఆర్ అభిమానులు, టీడీపీ వర్గం ఓటు వేయడం ద్వారా గోపీనాథ్‌కు నివాళులు అర్పిస్తారని కేటీఆర్ ప్రచారం చేస్తున్నారు. టీడీపీ మద్దతుదారుల ఓట్లపై భారతీయ జనతా పార్టీ కూడా గంపెడు ఆశలు పెట్టుకుంది. కేంద్రంలో, ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీతో కలిసి టీడీపీ, జనసేన పనిచేస్తున్నాయి. టీడీపీ, జనసేన మద్దతుదారులు తమ వైపే ఉంటారని బీజేపీ నేతలు భావిస్తున్నారు.